శ్రీకాకుళం :ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పోకిరీలకు అడ్డాగా మారుతోంది. యువతుల వెంటబడి వేధించడం, వారికి హితవు చెప్పబోయిన మహిళలతో అసభ్యకరంగా మాట్లాడటం, బెదిరించడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి.ఏదో ప్రాంతంలో ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. నగరమంతా సీసీ కెమెరా కళ్లున్నాయి. కానీ నగరంలోని పోలీసులకు ఇవేవీ పట్టవు. ఏదైనా దిశ, నిర్భయ వంటి ఘటనలు జరిగితే తప్ప పోలీసులు స్పందించరా అన్న ప్రశ్న మహిళల నుంచి వస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసులు, అధికారులు, జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తారా అనేదే ప్రశ్న.
అడుగడుగునా సీసీ కెమెరాలున్నాయి. అవి పని చేస్తున్నాయని ఓ హత్య, ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినిపై దాడి ఘటనలతో నిరూపితమైంది. ఇటీవల డ్రోన్ సాయంతో పోలీసులు అసాంఘిక శక్తులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని రోజూ వార్తలు వస్తున్నాయి. కానీ నగరంలో పలు కీలక ప్రాంతాల్లో గంజాయి బానిసలైన యువకులు తమ హీరోయిజాన్ని విద్యార్థినిలు, మహిళలపై ప్రదర్శిస్తున్నారు. వారి వేధింపులు, బెదింపులు ఇటు సీసీ కెమెరాల్లో అటు డ్రోన్ల నిఘాలో పోలీసులు గుర్తించకపోవడం విషాధకరం. కొన్నేళ్లుగా ప్రైవేట్ విద్యాసంస్థలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినిలు వస్తున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీల వద్ద పోకిరీల బెడద ఎక్కువైంది. పోకిరీ స్థాయి నుంచి ప్రమోషన్ పొంది బెదిరించే స్థాయికి కొందరు యువకులు ఎదుగుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన కొందరు యువకులకు స్కూళ్లు, కాలేజీలే అడ్డాగా మారాయి.విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపుల వద్ద సిగరెట్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు స్వీకరించి అక్కడికి వచ్చే వారితో గొడవలు పడటం సర్వసాధారణమైంది. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ యువతులను వేధిస్తున్నారు. ఈవ్టీజింగ్ చేస్తుంటే తల్లిదండ్రులు, అధ్యాపకులకు చెప్పుకుని యువతులు రోధిస్తున్నారు. తాము కాలేజీకి వెళ్లలేమని, చదువు మానేస్తామని చెబుతున్నారంటే, శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. బాలికలు ధైర్యంగా ఉండాలని మహిళ, హోంమంత్రి అనిత పలుమార్లు చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణమైన వాతావరణం నగరంలో మాత్రం లేదన్నది వాస్తవం.ఇటీవల స్థానిక ప్రభుత్వ మహిళ కళాశాల వద్ద ఓ అవాంఛనీయ ఘటన జరగడంతో ముఖ్యమంత్రి, హోం మంత్రి నుంచి ఉన్నత పోలీసు అధికారులు, కలెక్టర్ వరకూ కదిలిపోయారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో అటు పోలీసులు, ఇటు అధికారులు పరుగులు తీశారు. కానీ అవన్నీ మీడియా వెంటబడడంతో చేపట్టిన మొక్కుబడి చర్యలుగా అర్థమవుతోంది. ఆ ఘటన జరిగన కళాశాలలో అసాంఘిక శక్తులు ప్రవేశిస్తున్నాయని, రాత్రివేళల్లో మద్యం సేవిస్తున్నాయని, విద్యార్థినులను వేధిస్తున్నారని చెప్పినా తర్వాత చర్యలు కంటితుడుపుగా మిగిలాయి. పోలీసుల పర్యవేక్షణ, షీ టీం రాకపోకలు ప్రస్తుతం లేదని చెబుతున్నారు.
నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వెళుతున్నారు. 80 అడుగుల రోడ్డును ఆనుకుని ఉన్న ఓ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న పాన్షాపులు, అక్కడి సమీపంలోని ఓ కళ్యాణ మండపం ఎదుట ఉన్న పాన్షాపు, విశాఖ-ఎ కాలనీలో ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఎదుట ఉన్న కాలువకు ఆనుకుని ఉన్న పాన్షాపు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో విద్యుత్ శాఖ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ పాన్షాపు, న్యూకాలనీలో ఇంటర్మీడియట్ కళాశాలకు 20 అడుగుల దూరంలో ఉన్న ఓ పాన్షాపు, రామలక్ష్మణ కూడలిలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలోని ఆలయం దగ్గర, అదనపు కలెక్టర్ బంగ్లావెనుక దారిలో, న్యూ టీపీఎం హైస్కూల్ ఎదురుగా ఉన్న పాన్షాపులు, పాత హౌసింగ్ బోర్డు కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్న పాన్షాపు పోకిరీలకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో జులాయిలు వెంటబడి వేధిస్తున్నారనేది విద్యార్థినిల మాట. యువతుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వెంటబడుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
మిమ్మల్నేం చేస్తామో తెలుసా?
తాము ఇంటి నుంచి వస్తున్నపుడు, కళాశాల నుంచి వెళ్లేటపుడు విద్యార్థినిలు భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది. తమను వేధిస్తున్నారని కన్నీటితో విద్యార్థినులు చెబుతుంటే కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్పందించాయి. కళాశాల నుంచి విద్యార్థినిలు చెప్పిన చోటు వరకు కొందరు అధ్యాపకులు పర్యవేక్షించి, కొందరు పోకిరీలను పట్టుకుని మందలించారు. కొందరు ఈవ్టీజర్లు వెళ్లిపోతే, మరికొన్ని చోట్ల గ్యాంగ్లతో తిరిగి వచ్చి ఆ అధ్యాపకులను బెదిరిస్తున్నారు. మిమ్మల్ని ఏం చేస్తామో తెలుసా అంటూ బెదిరిస్తుండడంతో అధ్యాపకులే భయపడుతున్నారు. నగరంలో పోలీసుల సక్రమంగా పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల బ్యాంకర్స్ కాలనీలోని ఓ కార్పొరేట్ కళాశాల వద్ద సాయంత్రం సమయంలో విద్యార్థినిలు ఆకతాయిలు ఏడిపించారు. అదే కళాశాలకు చెందిన అధ్యాపకురాలు పరిస్థితిని గమనించి ఆకతాయిలను వారించారు. దీంతో సదరు అధ్యాపకురాలిపైనే ఆకతాయిలు తిరగబడటమే కాకుండా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశారు.
సాధారణంగా హైస్కూల్, కాలేజీలకు విద్యార్థినిలు సైకిళ్లు, ఆటోల్లో వెళతారు. అయితే పోకిరీల వేధింపులు పెరిగిపోవడంతో వారు స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు నిరాకరిస్తుండడంతో తల్లిదండ్రులే వారిని దిగబెడుతున్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలని, వారు కాలేజీలో ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నారని నగరానికి చెందిన ఓ చిరువ్యాపారి తెలిపారు. పిల్లలు భయపడుతుండడంతో, రోజూ సాయంత్రం వ్యాపారం వదులుకొని వచ్చి పిల్లలను కాలేజీ నుంచి ఇంటికి తీసుకువెళుతన్నానని చెప్పారు. ఉదయం, సాయంత్రం వ్యాపారం సాగే వేళయినా సరే, పిల్లల కోసం మానేస్తున్నానని తెలిపారు. కొందరు పిల్లలను షేర్ ఆటోలోనో, ప్రత్యేక ఆటోలోనో పంపిస్తారు. కానీ తన కూతురు వెళ్లే ఆటోను పోకిరీలు వెంబడించి వేధిస్తూ, ఇంటి వరకూ రావడంతో, ఆటోను పంపించకుండా, తను కూతురిని కళాశాల వద్ద దిగబెట్టి, తీసుకువస్తున్నానని సెకండియర్ విద్యార్థిని తల్లి తెలిపారు. నగరంలో పలువురు తల్లిదండ్రుల ఆవేదన ఇదే. ప్రతి ఒక్కరి వెంటా పోలీసులు రక్షణగా ఉండడం కష్టమే. కానీ, మత్తుపదార్ధాలకు అలవాటుపడినవారు, విద్యార్థినులను వేధిస్తున్నవారు, వద్దన్న వారించిన వారిని, బెదిరించేవారిని కట్టడి చేయాల్సింది పోలీసులే. లేకపోతే నగరం ఏ దిశనో, నిర్భయనో చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా స్కూళ్ల, కళాశాలలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని, షీ-టీం తిరుగుతూ పోకిరీలను నియంత్రించేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.