logo

ఆదిత్యుని సన్నిధిలో నకిలీ బంగారు, వెండి కళ్ల అమ్మకం...

శ్రీకాకుళం: దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆదిత్యునికి బంగారు, వెండి కళ్లను సమర్పిస్తే ఆ సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆలయ పరిసరాల్లోని కొందరు వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. ఒరిజనల్‌ పేరు చెప్పి నకిలీ బంగారు, వెండి కళ్లను భక్తులకు అంటడడుతున్నారు. ఈ నకిలీ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో దీనిపై ఆలయ అధికారులు, ప్రత్యేకించి పోలీసులు దృష్టి సారించడంతో ఈ వ్యాపారం కొంతకాలం పాటు ఆగిపోయింది. ఆ తరువాత అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ నకిలీ వ్యాపారం జోరందుకుంది. ఆలయానికి వచ్చే భక్తులకు బలవంతంగా నకిలీ బంగారు, వెండి కళ్లను వ్యాపారులు అంటగడుతున్నారు. ఈ కళ్లను కొనుగోలు చేస్తేనే కొబ్బరికాయలతో పాటు ఇతర పూజా సామగ్రిని అందజేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో భక్తులు తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. నడిచి వచ్చే భక్తులకు ఒక రేటుకు, బైక్‌లపై వచ్చే వారికి మరోలా.., కార్లపై వచ్చే వారికి ఇంకోక రేటుకు వాటిని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి కార్లలో వచ్చే భక్తుల నుంచి సుమారు రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల లెక్కింపు సమయంలో ఈ నకిలీ కళ్లను వేరుచేసి, వాటిని పోగుచేసి ఆలయ సిబ్బంది తగులబెడుతున్నారు. భక్తులు డబ్బులు నష్టపోవడమే తప్ప ఈ కళ్ల ద్వారా ఆలయానికి ఎటువంటి ఆదాయం సమకూరడం లేదని అధికారులు చెబుతున్నారు. అరసవల్లిలోని ఆదిత్యనగర్‌ కాలనీ, వెలమవీధిలో ఈ నకిలీ కళ్ల తయారీని ఒక కుటీర పరిశ్రమలా నడుపుతున్నారు. యంత్రాల సాయంతో ఈ కళ్లను తయారు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకునేవారు కరువయ్యారని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మా దృష్టికి వచ్చింది

కొందరు వ్యాపారులు నకిలీ బంగారు, వెండి కళ్లను భక్తులకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై అధికారులతో ఇదివరకే చర్చించాం. పోలీసు అధికారులతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. హుండీల లెక్కింపు సమయంలో సిబ్బంది కూడా ఈ నకిలీ కళ్లను వేరుచేసే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

-యర్రంశెట్టి భద్రాజీ, ఈవో, అరసవల్లి దేవస్థానం

0
1071 views