లెనినిజంతోనే ప్రపంచశాంతి
- వామపక్షాలంతా బలపడదాం
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ
- లెనిన్ శత వర్ధంతి ముగింపు(101వ వర్ధంతి)లో వామపక్ష నేతలు నివాళులు
విశాలాంధ్ర -
విజయవాడ(చిట్టినగర్): ప్రపంచంలో యుద్దోన్మాద ప్రభావం పెరిగిన నేర్పద్యంలో ప్రపంచశాంతి, మానవ మనుగడ కొనసాగాలన్న లెనినిజం, వామపక్షాల బలంతోనే సాధ్యమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ తెలిపారు.
మంగళవారం లెనిన్ సెంటర్ లో కారల్ మార్క్స్-ఎంగేల్స్-లెనిన్ విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు బుడ్డిగ జమిందార్ అధ్యక్షతన లెనిన్ 101వ వర్ధంతి కార్యక్రమంలో విగ్రహనీకి వామపక్ష నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద ప్రభావంతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో మతవాద, మితవాద శక్తుల ప్రాబల్యాన్ని ఎదుర్కోవాలంటే సైద్ధాంతిక కమ్యూనిస్టు భావజాలాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత వామపక్షాలపై ఉందని స్పష్టం చేశారు. ఈ కృషి ఫలితంగా భారతదేశంలో అన్ని వ్యవస్థలను కాపాడుకోవడానికి, శక్తులన్నింటినీ ఐక్యం చేయటానికి, వామపక్షాల బలం పెరిగేందుకు, కలిసి ఉద్యమించాలని అన్నారు. దీనికోసం సాంఘిక, సామాజిక, సాంస్కృతిక కృషి చేయటం ద్వారానే లెనిన్ కు ఘన నివాళులర్పించినవారవుతామన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలాధారమైన రాజ్యాంగాన్ని కాపాడితేనే కార్మిక విముక్తి కలుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ శత వర్ధంతి సందర్భంగా గత సంవత్సరకాలంగా అనేక సెమినార్ లు నిర్వహించుకుంటూ లెనిన్ కు ఘన నివాళులర్పిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా మానవజాతికి మార్క్స్, లెనినిజం స్ఫూర్తినిస్తూనే ఉంటదన్నారు. యుద్ధమే మూలమైన సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని, ప్రజాతంత్ర విప్లవాలను మొదలుపెట్టిన ఆ పెట్టుబడిదారి వర్గమే, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని,లెనిన్ చెప్పారని గుర్తు చేశారు. మన దేశంలో ప్రజలపై నియంతృత్వాన్ని రుద్దటం అక్షర సత్యాలుగా నిరూపితం అవుతుందని గ్రహించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మతోన్మాద ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలు ప్రజలపై బలవంతంగా రుద్దటానికి, కార్మిక వర్గాన్ని అణచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని హరించటాన్ని మనమంతా గమనిస్తున్నామన్నారు. పౌర హక్కులు లేవు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటానికి లేదు, సోషల్ మీడియాలో విమర్శిస్తూ పోస్టులు పెట్టే స్వేచ్ఛ లేదని ఈ పరిస్థితి దేశంలో కొనసాగుతుందని దుయ్యబట్టారు. ప్రశ్నించినా.., ప్రతిఘటించినా.., వేధింపు చర్యలు ఉంటున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం కొనసాగితే తీవ్ర పరిణామాలు చవి చూడవలసి వస్తుందని హెచ్చరించారు. కార్పోరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వామపక్షశ్రేణులంతా కలిసి రావాలని కోరారు. సీపీఎం తరపున లెనిన్ కు నివాళులర్పించారు.
సీపీఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసీ నాయకులు పోలారి, ఎస్ యుసిఐ నాయకులు అమర్నాథ్, నాగార్జున యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సి నరసింహారావు, దివి కుమార్, భార్గవ శ్రీ లు మాట్లాడుతూ దశాబ్దాలకాలంగా చరిత్రలో లెనిన్ సాధించిన సోషలిజం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని, సామ్రాజ్యవాదం యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న ఈ సందర్భంలో రష్యన్ విప్లవాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, ఐక్య ఉద్యమాలతో లక్ష్యసాధన సాధ్యమని, అప్పుడే లెనిన్ కు నిజమైన నివాళులని ప్రసంగించారు. సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.
ముందుగా ప్రజానాట్యమండలి గాయకుడు ఆర్ పిచ్చయ్య, ఎస్ కె నజీర్, ఎం అనిల్ విప్లవ గేయాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నార్ల వెంకటేశ్వరరావు, నక్కా వీరభద్రరావు, లంకా దుర్గారావు, కొట్టు రమణారావు, అజీజ్ భాష, రోమిలా, టీ వీరయ్య, సీపీఎం నాయకులు వై వి, దడాల సుబ్బారావు, సీహెచ్ బాబూరావు, ఆండ్ర మాల్యాద్రి, దోనేపూడి కాశీనాథ్, డీ వీ కృష్ణా, సాహితీప్రియులు శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు, వొరప్రసాద్, ఎం అరుణ్ కుమార్, ఇఫ్టు రామకృష్ణ, తదితర వామపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.