logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రణాళిక వైట్2 ఎస్ఎంఎస్ నిర్వహించిన.

Hyderabad:తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఏవైనా, ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే వాటిని సవరించుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిబద్ధతతో పనిచేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో అనేక అంశాలు, సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.

రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అన్న థీమ్తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియగా, అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు భావితరాలను తీర్చిదిద్దడానికి, 2047 నాటికి తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు.

ప్రజాప్రతినిధిగా ఆలోచనల్లో నాకు స్పష్టత ఉంది. నా ఆలోచనలపైన కొందరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అందరినీ మెప్పించలేం. వంద శాతం ప్రజలను మెప్పించాలని అనుకుంటే మనలో అసంతృప్తి తలెత్తుతుంది. 60 నుంచి 75 శాతం మంది మన ఆలోచనలను ఆమోదిస్తే అదే అతిపెద్ద విజయంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.

లక్ష్యం, మన ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాల్లో స్పష్టత ఉంటే మనలో దానికదే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్య ఎదురైనప్పుడు కచ్చితంగా కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మన లక్ష్యాన్ని గుర్తుచేసుకుని ముందుకు వెళ్లాలి. జీవితంలో క్లారిటీ ఆఫ్ థాట్స్ చాలా ముఖ్యం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ, ప్రజలు, పార్టీలు శాశ్వతంగా ఉంటాయి. ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. దాన్ని ప్రణాళిక రూపంలో రచించుకోవాలి. ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రానికి స్పష్టమైన, సమగ్రమైన లక్ష్యం లేదు. భవిష్యత్తు పట్ల స్పష్టమైన ఆలోచన, అందుకు సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లలేం.

ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి ప్రపంచ స్థాయి మేధావులు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించి దాదాపు 8 నెలలు శ్రమించి రాష్ట్ర భూ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం. దాదాపు 108 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించాం అని గుర్తుచేశారు.

సమస్యలన్నీ ఒక్కసారిగా పరిష్కారం కావని, అధికారం చేపట్టిన తర్వాత దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, బీసీ కులగణన, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి తీసుకెళ్లిన జయ జయహే తెలంగాణ... గీతాన్ని రాష్ట్ర గీతంగా, అమర వీరుల కుటుంబాలను గౌరవించడం లాంటి సందర్భాలను ముఖ్యమంత్రి గారు ఉదహరించారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తుమ్మడిహెట్టి, పాలమూరు రంగారెడ్డితో పాటు అనేక ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని 40 శాతం జనాభా ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం (కోర్ అర్బన్ రీజియన్ - CURE) లో నివసిస్తున్నారు. ఇక్కడ అనేక సమస్యలున్నాయి. కోర్ ఏరియాలో సమస్యలను ఏ విధంగా క్యూర్ చేయాలన్నదే మా పాలసీ.

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపించడానికే హిల్ట్ పాలసీ తెచ్చాం. నగరంలో నదులు, చెరువులు కుంటలు, నాలాలు, పబ్లిక్ పార్కులు, ప్రభుత్వ స్థలాలు.. ఇలా ప్రతిదీ ఆక్రమించుకున్నారు. ఇలాంటివి మొత్తంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది.

మూసీ పునరుజ్జీవం చేసి తీరుతాం. నాలాల ఆక్రమణలను తొలగిస్తాం. కబ్జాలకు పాల్పడుతూ నీళ్లను స్థావరంగా చేసుకోవద్దు. నీళ్ల దగ్గరకు ఎవరూ వెళ్లొద్దు. సంస్కరణలు తీసుకురావడమన్నది యుద్ధం లాంటిదే. నేను నా కోసం, నా ఇంటికోసం పనిచేయడం లేదు. భవిష్యత్ తరాల కోసం చేస్తున్నా. లక్ష్యం సరైనదైనప్పుడు కొన్ని తిట్లయినా నేను భరిస్తా అని అన్నారు.

ప్రతిష్టాత్మకమైన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి గారు వివరిస్తూ.. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, కనెక్టివిటీని సిద్ధం చేయడం, మెట్రో, నేషనల్ హైవే, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్పోర్టు కనెక్టివిటీ లాంటి ఎకో సిస్టమ్ మనం అభివృద్ధి చేస్తే లక్షలాదిగా పెట్టుబడులు వస్తాయి అని అన్నారు.

పరిమితమైన ప్రణాళికలు అమలు చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని ముందుకు తీసుకువెళతాయా లేదా చెప్పలేం. లక్షలాది మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభించే ITIR ను అంతకుముందున్న ప్రభుత్వం తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు ఈ సందర్భంగా ఉదహరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ డ్రాప్అవుట్స్ ఆడపిల్లలవే ఉండేవి. గ్రామాల్లో 7వ తరగతి పూర్తిచేసి 8వ తరగతికి పక్క ఊరికి వెళ్లాలంటే తల్లిదండ్రులకు అదనపు భారం పడుతుంది. ఇలాంటివి ఆలోచించే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఖర్చులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాం.

గడిచిన 28 నెలల్లో ఆర్టీసీకి ప్రభుత్వం 10 వేల కోట్లు చెల్లించింది. ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఒక్కో మహిళ 10 వేల రూపాయలు ఆదా చేసుకోవడం వల్ల పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. 2024-25 లో ప్రభుత్వ పాఠశాలల్లో జీరో డ్రాప్అవుట్స్ నమోదైనట్టు నీతి ఆయోగ్ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు.

రాజకీయాల్లో 51 శాతం మార్కులొస్తే మిగిలిన 49 శాతం విలువ సున్నా అవుతుంది. ఇక్కడ తేడా రెండు శాతమే. 51 శాతం మంది ప్రజలను మెప్పించాలని పరిపాలన సాగిస్తే అది 60 లేదా 70 శాతం చేరొచ్చు. మన నిర్ణయాలను 60 నుంచి 75 శాతం ప్రజలు ఆమోదిస్తే అది విజయంగా మారుతుంది. మనల్ని అంగీకరించని వారిని అణిచివేయాలని ఆలోచనతో వెళితే సమయమంతా వృధా అవుతుంది. మనకేం కావాలన్న లక్ష్యం వైవు వెళితే తప్పకుండా ఫలితాలు వస్తాయి అని శ్రీ రేవంత్ రెడ్డి గారు వివరించారు.

8
248 views

Comment