బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక డిమాండ్.బీసీ లంటే ఎవరు? 42% రిజర్వేషన్స్ సాధ్యమా?
భారత రాజ్యాంగం బీసీలు అంటే వెనుకబడిన కులాలుగా కాకుండా వెనుకబడిన తరగతులుగా నిర్వచించి వెనుకబడ్డ కులాలకు తీరని అన్యాయం చేసింది. ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబడిన తరగతులు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులు. అదేవిధంగా ఆర్టికల్ 15(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులే బీసీలు. కేంద్ర ప్రభుత్వ లిస్ట్లో ఓబిసీలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొన్నప్పటికీ, వెనుకబడిన తరగతులు అంటే ఎవరు? వారిని ఏ ప్రామాణికాల ఆధారంగా గుర్తించాలి? అనే అంశాన్ని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. ఇదే కారణంగా బీసీల సామాజిక న్యాయం ఆలస్యమైంది. న్యాయస్థానాల జోక్యం పెరిగి బీసీ ల కు తీవ్ర అన్యాయం జరిగింది. అదే రాజ్యాంగం SC ,ST ల ను స్పష్టంగా నిర్వచించింది
నిజానికి హిందూ సామాజిక వ్యవస్థలోని 4వ వర్ణమే, అంటే నాటి శూద్రులే నేటి బీసీలు. బీసీలు ఒక సజాతియ సమూహం కాదు; ఇందులో ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార, అర్ధ సంచార జాతులు, ఆశ్రిత కులాలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ కులాలన్నీ ఒకే సామాజిక ,రాజకీయ, ఆర్థిక స్థితిలో లేవు.భారత రాజ్యాంగం బీసీలను వెనుకబడిన కులాలుగా కాకుండా వెనుకబడిన తరగతులుగా నిర్వచించడం వల్ల, బీసీల గుర్తింపు మరియు హక్కుల అమలు విషయంలో దశాబ్దాల పాటు అనేక చట్టపరమైన, రాజకీయ అవరోధాలు ఏర్పడ్డాయి.. తెలంగాణలో జీవో ఎంఎస్ నెంబర్ 3, తేదీ 09-09-2020 ప్రకారం 130 కులాలు, BC-A, BC-B, BC-C, BC-D, BC-E వర్గాలుగా విభజించబడ్డాయి. కేంద్ర ఓబీసీ జాబితాలో సుమారు 2633 కు పైగా కులాలు ఉండగా, దేశవ్యాప్తంగా రాష్ట్రాల జాబితాలు కలిపితే దాదాపు 5000 వరకు బీసీ కులాలు ఉన్నాయని వివిధ అంచనాలు సూచిస్తున్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల పరిస్థితిని అధ్యయనం చేసి, వారికి విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు కమిషన్ను నియమించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 1953లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అంబెడ్కర్ గారి ఒత్తిడి మేరకు మొదటి బీసీ కమిషన్ కాకా కాలేల్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ 2399 కులాలను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి 1955 లో నివేదిక సమర్పించగా, నెహ్రూ ఆ నివేదికను అమలు చేయకుండా, పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండానే తిరస్కరించారు . చివరకు 1961 లొ ఒక మెమో ఇచ్చి ఇక బీసీలను రాష్ట్రాలే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. అందులో ఆర్థిక పరంగా మాత్రమే బీసీలను గుర్తించాలని వారు సూచించారు
తర్వాత జనతా ప్రభుత్వ కాలంలో, ములాయం సింగ్,, లాలూ ప్రసాద్ యాదవ్,శరద్ యాదవ్ మొదలగు యాదవ నాయకుల , చరణ్ సింగ్ వంటి నాయకుల ఒత్తిడితో రెండో బీసీ కమిషన్గా మండల్ కమిషన్ 1977 లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్ 11 సామాజిక, విద్యా, ఆర్థిక సూచికల ఆధారంగా 3743 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించింది. అయితే బీసీలను కులాల ప్రాతిపదికన గుర్తించడం సరైంది కాదంటూ కోర్టుల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తెలంగాణలోనూ 196070 దశకాల్లో వచ్చిన రెండు జి ఓ లైన 1886 తేదీ 21-06-1963 మరియు 1880 తేదీ 29-7-1966 లను A.P. హైకోర్టు కొట్టి వేసింది. అనంతరామన్ కమిషన్ సిఫారసులపై ఇచ్చిన జి ఓ 1793 తేదీ 23-09-1970 ని కూడా హైకోర్టు కొట్టి వేయగా 1972 జనవరి లో సుప్రీమ్ కోర్ట్ లో ఇది న్యాయ సమ్మతమే అని తీర్పు ఇవ్వగా అప్పటినుంచి అమలువుతున్నవి . సుప్రీంకోర్టు కులం కూడా ఒక సామాజిక వర్గమే అని స్పష్టం చేస్తూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించింది.
మండల్ కమిషన్ రిపోర్ట్ న్యాయ సమీక్ష పై 1992లో వచ్చిన చారిత్రాత్మక ఇంద్రా సహాని తీర్పు బీసీ రిజర్వేషన్లకు కీలక మలుపు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు కులాన్ని సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన ప్రమాణంగా అంగీకరించింది. అదే సమయంలో 50% రిజర్వేషన్ పరిమితి అనే భావనను కూడా ప్రవేశపెట్టింది.
తర్వాత కాలంలో ఇంద్రా సహాని కేసు ఆదేశాల మేరకు రాజ్యాంగంలో 340 అధికరణం అధికారికంగా 1993 లో జాతీయ వెనుకబడిన చట్టాన్ని చేయడం జరిగింది. 2018 లో ఈ జాతీయ వెనుకబడిన చట్టాన్ని రద్దు చేసి 102 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 338 బి చేర్చి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఆ సమస్త రాజ్యాంగ ప్రతిపత్తి గల సంస్థగా ఆయుర్భవించింది. అదేవిధంగా బీసీల నిర్వచనానికి వస్తే రాజ్యాంగంలో 102 వ సవరణ ద్వారా చేర్చిన అధికారణం 366 (26 సి ) వెనుకబడిన తరగతులు ఎవరని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వచనం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం అధికరణం 342 ఏ లో పేర్కొనబడిన వర్గాలు . అదేవిధంగా రాజ్యాంగంలోని 342 ఏ1 మరియు ఏ2 కింద కేంద్రము తన సొంత సామాజికంగా, విద్యబడిన వెనుకబడిన తరగతుల జాబితా నిర్వహించుకోవచ్చును . అలాగే 342 ఏ3 కింద రాష్ట్రాలు నిర్వహించుకోవచ్చును. ఇప్పుడు బీసీ లంటే ఎవరు అనే రాజ్యాంగ గుర్తింపు రావటం జరిగింది
రాజ్యాంగం వెనుకబడిన తరగతుల ను స్పష్టముగా నిర్వచించకపోవడంతో సామాజిక న్యాయం అందడంలో చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. కేంద్రంలో 93 నుంచి మాత్రమే ఓబిసి లకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే దాదాపు 46 సంవత్సరాలు ఇక్కడ కేంద్రంలో రిజర్వేషన్లు లేవు. ఆ సందర్భంలో సృష్టించబడిన అనేక లక్షల ఉద్యోగాలు బీసీలకు అందుబాటులో లేకుండా పోయినాయి. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు 22 శాతానికి మించి లేరు. అలాగే రాష్ట్రాల్లో కూడా 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది. మరి స్వాతంత్రం కొత్తలో సృష్టించబడిన లక్షల ఉద్యోగాలకు వారు దూరం కావడం జరిగింది. అందుకే నేడు బీసీ వర్గాలకు ఈ దుస్థితి.
50% సీలింగ్ ను బ్రేక్ చేయ వచ్చునా ?
ముఖ్యంగా రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనే అంశం ప్రాథమిక హక్కుల పార్ట్ లో ఉన్నాయి. ఆర్టికల్ 16(4 ) ప్రకారం తగు ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనం కల్పించాలని చెప్పడం జరిగింది. కానీ అందులో ఎంత శాతం కల్పించాలి అనేటువంటి విషయాన్ని వారు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ లొసుగు ను ఆధారంగా చేసుకొని కోర్ట్లు 50 శాతానికి మించి ఇవ్వకూడదు అని వ్యాఖ్యానం చేయడం మొదలు పెట్టినాయి. మొట్టమొదట 1961 లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్స్ 50% దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, లకు జనాభా దామాష్ ప్రకారం ఇచ్చి 50 శాతంలో మిగతాది మాత్రమే బీసీలకు ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును అనేక కోర్ట్లు తమకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకుంటూ ఎక్కడ బీసీలకు 50 శాతం దాటిన అడ్డుకోవడం జరిగింది. స్వాతంత్ర్య భారతము లో 8 రాష్ట్రాలలో అడ్డుకోవటం జరిగింది. మన సంయుక్త ఆంధ్త్ర ప్రదేశ్ లో కూడా 1986 లో బీసీ లకు 44% రిజర్వేషన్ కల్పిస్తూ జి ఓ ఇస్తే హై కోర్ట్ కొట్టి వేసింది .అందుకే మన దగ్గర కూడా అనంతరామన్ కమిషన్ గాని (30%) , మండల్ కమిషన్ ( 27%) గాని 50 శాతానికి లోబడే వారు రికమెండేషన్ చేయడం జరిగింది. మరి రాజ్యాంగంలో లేనటువంటి అంశాలను కోర్ట్లు వ్యాఖ్యానం చేస్తూ ఈ సమస్యను మరింత సంక్లిష్టంగా చేయడం జరిగింది. అయితే ఈ 50% పరిమితి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కోర్టుల వ్యాఖ్యానం మాత్రమే. అంతేకాదు, ఇంద్రా సహాని తీర్పులో పారా 830 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని అధిగమించవచ్చని కూడా పేర్కొన్నారు.
తెలంగాణ ఒక ప్రత్యేక సామాజిక-చారిత్రక నేపథ్యం కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జనాభా కలిపి సుమారు 90 శాతానికి చేరువలో ఉంటుంది. అదే సమయంలో పేదరికం, సామాజిక వెనుకబాటుతనం కూడా అధికంగా కనిపిస్తాయి. శతాబ్దాల పాటు కొనసాగిన రాచరిక మరియు భూస్వామ్యా వ్యవస్థల ప్రభావంతో బలహీన వర్గాలు తీవ్రంగా నలిగిపోయాయి. అందువల్ల తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా పురోగతిని దృష్టిలో పెట్టుకొని 50% సీలింగ్ ను దాటి రిజర్వేషన ఇవ్వడానికి చారిత్రక మరియు సామాజిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సీలింగ్ ను బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయి.
తెలంగాణ లో 42% రిజర్వేషన్స్ సాధ్యమా? తెలంగాణలో ప్రస్తుతం బీసీల జనాభా సుమారు 56%కు పైగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక సర్వే చెబుతోంది. అయినప్పటికీ వారికి కేవలం 29% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇది తగిన ప్రాతినిధ్యం కాదు. అందుకే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 2025లో రాష్ట్ర అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే అది ఇంకా పెండింగ్లోనే ఉంది. వాస్తవానికి ఏవి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినవి కావు. తగు ప్రాతినిధ్యం లేదని 56.33% జనాభా కు 42% రిజర్వేషన్స్ . 10% లేని EWS లకు 10% రిజర్వేషన్స్ ఇవ్వవచ్చును. కానీ 56% బీసీ లకు 42% ఇవ్వ కూడదు. ఇది ఇక్కడి సామజిక న్యాయం.
తమిళనాడు సామాజిక న్యాయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. అక్కడ ప్రత్యేక చట్టం ద్వారా 69% రిజర్వేషన్లను అమలు చేస్తూ, దాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు. బీసీ లకు చట్ట బద్దంగా 50% రిజర్వేషన్స్ ఇస్తున్నారు ఇప్పటికీ ఆ చట్టం అమల్లో ఉంది
అయితే 2007లో I.R. Coelho vs State of Tamil Nadu Judgment (సిసిరో కేసు అని కూడా పేర్కొంటారు)లో సుప్రీం కోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు కూడా పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతం కావని, అవి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే మాత్రమే కోర్టులు పరిశీలిస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 9వ షెడ్యూల్లో సుమారు 284 చట్టాలు చేర్చబడినప్పటికీ, వాటిలో ఏ ఒక్క చట్టాన్నీ సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాగే 2022లో Janhit Abhiyan vs Union of India Judgment కేసులో EWS రిజర్వేషన్లపై తీర్పు ఇస్తూ, 50% రిజర్వేషన్ పరిమితి రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశం సిసిరో తీర్పులో కూడా ప్రతిధ్వనించింది రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే న్యాయ సమీక్ష వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. కాబట్టి తెలంగాణలో ప్రతిపాదిత 42% రిజర్వేషన్ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఎలాంటి రాజ్యాంగపరమైన ప్రమాదం ఉండదని చెప్పవచ్చు. అంతేకాదు, అలా చేయడం ద్వారా ఆ చట్టాలకు మరింత బలమైన రాజ్యాంగ రక్షణ లభించే అవకాశం ఉంటుంది
ఇక్కడ ప్రధాన సమస్య రాజకీయ సంకల్పం లేకపోవడం. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఆధిపత్య కులాల చేతుల్లో ఉండటంతో, బీసీల నిజమైన సాధికారతపై వారికి ఆసక్తి తక్కువ. కేవలం ప్రకటనలు, జీవోలు, కమిటీలు పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఆ యా పార్టీ ల లోని బీసీ నాయకులు కూడా తమ పార్టీలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే పరిస్థితిలో లేరు. అగ్ర వర్ణ , ఆధిపత్య మీడియా మన సమస్యలను హైలైట్ చేయదు
అందుకే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్వ విద్యార్థులు తంత్ర బీసీ సంఘాలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, యువతపై ఉంది. చరిత్ర చెబుతోంది , ఉద్యమం లేకుండా హక్కులు రావు. 1951లో జరిగిన మొదటి రాజ్యాంగ సవరణ కూడా తమిళనాడులో పెరియార్ ఉద్యమ ఒత్తిడితోనే జరిగింది. అదే ఉద్యమ స్పూర్తి తెలంగాణలో కూడా అవసరం.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి సుమారు 90% జనాభా ఉన్నారు. అయినప్పటికీ అధికారం, విద్య, ఉద్యోగాలు, సంపద, మీడియా, న్యాయవ్యవస్థ వంటి కీలక రంగాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ కేవలం ఒక రాజకీయ డిమాండ్ కాదు; అది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న చారిత్రాత్మక పోరాటం.
ఈ హక్కులు ఎవ్వరూ స్వచ్ఛందంగా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజా ఉద్యమం ద్వారానే సాధించాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యంగా పోరాడితేనే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దిగివస్తాయి. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి కళాశాలలో, ప్రతి వృత్తి వర్గంలో చైతన్యం తీసుకెళ్లాలి. 42% రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ సమాజం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ డిమాండ్ ను సాకారం చేస్తాయి.
టి . చిరంజీవులు. విశ్రాంత ఐఏఎస్ మరియు
చైర్మన్, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరమ్.