logo

జీవితం నాశనం చేసే మాదక ద్రవ్యాల ను సంకల్పం తో నియంతృద్దాం.



జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలను "సంకల్పం"తో నియంత్రిద్దాం
విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

డ్రగ్స్ వినియోగం శృతిమించితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని యువతను హెచ్చరించిన జిల్లా ఎస్పీ

“బీ స్మార్ట్ - డోన్ట్ స్టార్ట్' అంటూ విద్యార్థులకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన జిల్లా పోలీసులు

డ్రగ్స్ నుండి బయపడేందుకు వైద్య కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ

డ్రగ్స్ గురించిన సమాచారాన్ని అందించేందుకు కళాశాలలో 'డ్రాప్ బాక్సులు' ఏర్పాటు చేసిన పోలీసుశాఖ

మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం” కార్యక్రమాన్ని నవంబరు 12న విజయనగరం పట్టణం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంరేంజ్ డిఐజి శ్రీ గోపీనాథ్ జట్టీ, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ మాట్లాడుతూ - యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండాను, అలవాటు నుండి దూరం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 'సంకల్పం' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు రూపొందించిన 100రోజుల ప్రణాళికలో భాగంగా పోలీసుశాఖ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతీరోజూ చర్యలు చేపడుతుందన్నారు. కొన్ని డ్రగ్స్ న్యాయబద్ధంగా తయారుచేస్తూ, వైద్యంలో వినియోగిస్తుంటే, మరికొన్ని రకాల మత్తు కలిగించే గంజాయి, నల్లమందు పంటలను అక్రమంగా పండిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో 10 వేల ఎకరాల్లో గంజాయి పంటను నాశనం చేసి, 3000మందిని అరెస్టు చేసామన్నారు. గంజాయి పండించే రైతుల జీవనోపాధికి పెద్ద పీట వేస్తూ, ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు విత్తనాలను, మొక్కలను ఏజన్సీ ప్రాంతాల్లో ఉచితంగా అందించామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అరెస్టుల కంటే అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం అన్నది ఒకరి సమస్య కాదని, సమస్య ప్రతీ ఒక్కరదని, వాటిని నియంత్రించే బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందన్నారు. మారుతున్న కాలంతోపాటు ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ క్రైం, సోషల్మీడియా నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, వీటిని నియంత్రించేందుకు పోలీసుశాఖ కూడా కొన్ని నైపుణ్యాలను మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాల్లో వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఆయా సందేశాలను ఇతరులకు పంపడం నేరమన్నారు. అంతేకాకుండా, డిజిటర్ అరెస్టు, డిజిటల్ కోర్టు, ట్రాయ్, పార్సిల్స్, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే ఫోను కాల్స్ ను నమ్మవద్దని, అటువంటి కాల్స్ కు ఎవ్వరూ స్పందించవద్దన్నారు. ఈ తరహా కాల్స్ వచ్చినపుడు నంబర్లును నోట్ చేసుకొని, 1930కు లేదా సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానమన్నారు. మీకు తెలిసిన విషయాలను క్షేత్ర స్థాయిలో మీ బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించి, డ్రగ్స్ కు అలవాటు పడకుండా, సైబరు మోసాలకు గురికాకుండా చూడాలని మెడికల్ విద్యార్థులను డిఐజి గోపినాధ్ జట్టి కోరారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - మాదక ద్రవ్యాల ప్రభావం ఏవిధంగా ఉంటుంది, కెరియర్, మానవ జీవితాలను ఏవిధంగా నాశనం చేస్తాయన్న విషయాలు వైద్య వృత్తి చేపట్టనున్న విద్యార్థులకు తెలుసునన్నారు. డ్రగ్స్ నియంత్రణ అన్నది సమాజానికి పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నారు. మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు అరెస్టులు చేపట్టేకంటే అవగాహన కల్పించడంతోనే నిర్మూలించ వచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకొని వచ్చి, వారిని మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, వాటి అలవాటు నుండి బయటపడేందుకు 'సంకల్పం' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యార్థులు ఒకసారి డ్రగ్స్ ను వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో ఉంటారని, కాని డ్రగ్స్ వినియోగించడం ప్రారంభిస్తే త్వరితగతిన బానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువతకు వారి చెడు అలవాట్లుకు సరిపడే డబ్బులు లేక చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడి దురదృష్టవసాత్తు నేరస్థులుగా మారుతున్నారన్నారు. హత్య నేరంకు పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష 14సం.లుజైలు శిక్ష విధిస్తే, గంజాయి కేసుల్లో నిందితులుగా పట్టుబడిన వారికి 20 సం.లు వరకు జైలుశిక్షను న్యాయ స్థానాలు విధిస్తున్నాయంటే, గంజాయి అక్రమ రవాణ, వినియోగం, విక్రయాలు ఎంతటి తీవ్రమైన నేరమోనన్న విషయాన్ని యువత గుర్తించాలన్నారు. పడే అవకాశం కూడా ఉందన్నారు. కావున, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, ఒకవేళ అలవాటు పడిన వారెవరైనా ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా డీ అడిక్షన్ సెంటరులో ప్రాధమిక స్థాయిలో చికిత్స పొందితే, వాటి నుండి బయట పడవచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా॥ పద్మలీల మాట్లాడుతూ - ఎక్కువగా యువత మాదక ద్రవ్యాల ప్రభావానికి గురవుతూ తమ జీవితాలను, భవిష్యత్తును ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారన్న విషయాన్ని జిల్లా పోలీసుశాఖ చక్కగా వివరించిందన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం, దేశంగా మార్చేందుకు అందరూ సంఘటితమై మాదకద్రవ్యాల దుష్ప్ర్పభావాలను వివరించి, అవగాహన కల్పించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా॥ ఎస్. అప్పల నాయుడు మాట్లాడుతూ - మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారికి చికిత్సను అందించే కంటే వాటి బారిన పడకుండా అవగాహన కల్పించడమే ప్రధానమని, అందుకు అవసరమైన సహాయ, సహకారాలను పోలీసుశాఖకు వైద్య విద్యార్థులు అందించాలని కోరారు.

మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను తెలియపరుస్తూ జిల్లా పోలీసుశాఖ రూపొందించిన పవర్పాయింట్ ప్రెజెంటేషను, ప్రదర్శించిన వీడియోలు విద్యార్ధులను ఎంతగానో ఆలోచింపజేసాయి. మాదక ద్రవ్యాలను నియంత్రించుటలో భాగంగా వైద్య కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు, యాజమాన్యం, స్థానిక ఇన్స్ పెక్టరుతో యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేసారు. మాదక ద్రవ్యాలపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్ను విద్యార్థులకు అందజేసారు. డ్రగ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన ఎంత వరకు ఉందో తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన క్వచ్చన్ పేపరును విద్యార్థులకు అందజేసి, జవాబులు రాబట్టారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ చుట్టూ ఉన్న వారిని కూడా మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని విద్యార్ధులతో విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల విద్యార్థులను డ్రగ్స్ వినియోగం, కలిగివున్న వారి సమాచారంను అందించేందుకు కళాశాల్లో డ్రాప్ బాక్సు లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేసారు. అదే విధంగా డ్రగ్స్ అలవాటు పడిన విద్యార్థులను బయటపడేందుకు సహాయాన్ని అందించేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

అనంతరం, డిఐజి గోపీనాద్ జట్టీ విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగిన కళాశాలగా ధృవపరుస్తూ సర్టిఫికేటును కళాశాల ప్రిన్సిపాల్ డా॥ పద్మలీల కు అందజేసారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ సిఐ డా॥ బి. వెంకటరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా॥ పద్మలీల, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా॥ ఎస్. అప్పల నాయుడు, ప్రభుత్వ సైక్రియాటీ హెచ్.ఓ.డి. డా॥ మల్లిక, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, సిఐలు టి. శ్రీనివాసరావు, ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, సూరి నాయుడు, ఈ. నర్సింహమూర్తి, బి. లక్ష్మణరావు, ఎల్.అప్పల నాయుడు, బి. లలిత, ఎస్ఐలు, వైద్య కళాశా ప్రొఫెసర్స్, మెడికల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1
363 views