logo

నేనూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడినే.. వివరాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ ట్వీట్

Pv Ramesh On Land Titling Act: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ట్వీట్ చేశారు. #LandTitlingAct హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన పోస్ట్‌ చేశారు. తాను ప్రత్యక్ష బాధితుడినని చెప్పుకొచ్చారు. 36 ఏళ్ల పాటు ఐఏఎస్‌ అధికారిగా ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ప్రధానాంశాలు:
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వేడెక్కిన రాజకీయాలు
ఈ చట్టంపై ట్వీట్ చేసిన మాజీ IAS అధికారిక పీవీ రమేష్
తానూ కూడా ఈ చట్టం బాధితుడ్ని అంటూ ట్వీట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ చట్టం అమలు చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల ఆస్తుల్ని కొట్టేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం జగన్ కూడా కౌంటరిచ్చారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు లాక్కునేవాడు కాదన్నారు. ప్రజల భూములపై వారికే సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశమన్నారు.
అయితే ఈ చట్టంపై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్వీట్ చేశారు. 'నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం' అన్నారు. పీవీ రమేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. బ్రిటిషర్ల కాలంలో ఎప్పుడో వందేళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని.. అప్పట్నుంచి మళ్లీ భూముల సర్వే జరగలేదని గుర్తు చేశారు. ఈ కారణంగా భూముల సబ్‌ డివిజన్‌ జరగకపోవడంతో క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల సచివాలయాల్లో సర్వేయర్లను నియమించి భూముల రీసర్వే జరిపిస్తున్నామన్నారు.
ఎవరి భూమి మీద వారికి సంపూర్ణ హక్కులు కల్పించేందుకే భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ పత్రాలు వారికి అందిస్తామని.. ఇంత గొప్ప కార్యక్రమానికి మద్దతు తెలపకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని.. అసలు తాను ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని తాను చేయననన్నారు.

2
100 views