logo

Visakhapatnam: ముఖ్యమంత్రి పదవిపై మనసులో మాట చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒక్క మాటలో తేల్చేశారు

Pawan Kalyan On Cm Post: రాష్ట్రంలో సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామన్నారుపవన్ కళ్యాణ్. తండ్రిలేని బిడ్డ అని చెప్పడంతో.. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ అయిపోయిందన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిడ్డల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్‌ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు. అలాగే ఆడబిడ్డల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రధానాంశాలు:
జగన్ సర్కార్‌పై మండిపడ్డ పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి పదవిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు
బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు అవకాశం ఇచ్చారని.. ఈ సారి ప్రజలు వారి భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఒక్క ఛాన్స్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారని.. ఆయన నుంచి ప్రజల్ని కాపాడేందుకు వచ్చానన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో కాలం నిర్ణయిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.
23 లక్షల మంది శక్తియుక్తులున్న యువతను ఈ ప్రభుత్వం గంజాయిలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు చేసిందని విమర్శించారు పవన్. దేశంలోనే రాష్ట్రం గంజాయిలో నంబర్‌ వన్‌ అయ్యిందన్నారు. విశాఖ పోర్టులో 25 వేల కిలోల హెరాయిన్‌ దొరికిందని.. యువతను ఇలాంటి వ్యసనాలకు బానిస చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో తొక్కేద్దామన్నారు.. పాకిస్థాన్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీని ముంచినట్టు సముద్రంలో తొక్కేద్దామన్నారు. ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ యువకుడు, భవిష్యత్తుకు బాగా చేస్తాడు అని ఓటు వేస్తే కరప్షన్‌ కింగ్‌ అయ్యారన్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్‌ అరాచకాలు చేస్తుంటే ఇక్కడ అదీప్‌ రాజ్‌ దోపిడీలు చేస్తున్నారన్నారు. పరవాడలో నిర్మాణం చేపట్టాలంటే డబ్బులు కట్టాలి.. అపార్ట్‌మెంట్లు కొనాలన్నా, లే అవుట్‌ వేయాలన్నా ఈ ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలన్నారు.
ప్రజలు ప్రభుత్వానికి టాక్సులు కడుతున్నారు.. ఈ ఎమ్మెల్యేకి దేనికి భయపడాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ దోపిడీలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని.. అనకాపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా సీఎం రమేష్‌, పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్‌ బాబులను గెలిపించాలన్నారు. తనకు పదవి ఇవ్వకపోయినా గుండెచప్పుడు అయ్యానని.. ఓటు అడుగుతున్నావు కావాల్సిన పనులు చేయకపోతే ప్రశ్నించొచ్చన్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వంలో ప్రతి నెలా రూ.6 వేల పింఛన్‌ ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ప్రతి ఇంటికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు.
ప్రధాన మంత్రి గారి అండతో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు పథకాన్ని తీసుకువస్తామన్నారు జనసేనాని. యువత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభ గణాంకాలు చేపడతామన్నారు. 2047 నాటికి ఇండియా సూపర్‌ పవర్‌ అవుతుందన్నారు. అలా కావాలి అంటే యువతలో ఉన్న ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావాలన్నారు. రవాణా కార్మికులకు డ్రైవర్స్‌ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్రైవర్లను ఓనర్లను చేస్తామని.. 4 లక్షలు పైబడిన వాహన కొనుగోలు రుణాలకు 5 శాతం వడ్డీ సబ్సిడీ. టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్‌ కలిగిన వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం.. జీవో 21 రద్దు చేస్తామన్నారు. గ్రీన్‌ టాక్స్‌ తగ్గిస్తామన్నారు. అలాగే చెత్త పన్నును కూడా రద్దు చేస్తామన్నారు.

3
164 views