logo

AP News: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. నో టెన్షన్, క్లారిటీ వచ్చేసింది!

Ap Ration Distribution: ఏపీలో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభంకానుంది. ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ మొదలవుతోంది. బియ్యంతో పాటుగా గోధుమ పిండి, పంచదారను అందజేస్తారని అధికారులు తెలిపారు. తక్కువ ధరకే ప్రతి ఒక్కరికి రేషన్‌ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా రేషన్ పంపిణీకి సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలియజేశారు.
ప్రధానాంశాలు:
ఏపీలో నేటి నుంచి రేషన్ ప్రారంభం
ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ
బియ్యంతో పాటుగా సరుకులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పం పిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. మొబైల్‌ డిస్పర్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) ఆపరేటర్లు బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించారు. షెడ్యూల్‌ ప్రకారం రేషన్‌బియ్యం, పంచదార, గోధుమపిండి నిర్దేశిత ధరలతో కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేలా ఆదేశించారు అధికారులు. విటమిన్‌ బీ12, ఐరన్‌ కలిపిన పోషకవిలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
పోషక విలువలున్న పోర్టిఫైడ్‌ బియ్యం, పంచదార, గోధుమ పిండిని జిల్లాలోని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గోధుమపిండిని కేజీ రూ.16 ఇస్తారని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని అనధికారికంగా కొనుగోలు, అమ్మకాలు చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చ రించారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1967కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.
వాస్తవానికి రేషన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు కూడా ఉండేవారు. అయితే ఎన్నికల సమయం కావడంతో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్‌వోలు రేషన్ పంపిణీలో పాల్గొననున్నారు. రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే వీఆర్వోలు వాటిని సరి చేయాలని అధికారులు సూచించారు.
ఎండీయూ ఆపరేటర్లు సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్ల సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వాలంటీర్లను పింఛన్ల పంపిణీలో పాల్గొనవద్దని ఇటీవల ఆదేశించింది.

10
1522 views