ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- ప్రపంచ మహాసముద్ర దినోత్సవం.......
తేదీ: 08-06-2026* శేర్లింగంపల్లి చందానగర్ :
ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో మహా సముద్రాల పాత్ర అత్యంత కీలకమైనదని, సముద్రాలను కాపాడటమంటే మానవాళి భవిష్యత్తును కాపాడటమే అని ఆచార్య P. శ్రీనివాస్ గారు అన్నారు.
ఈరోజు ఉదయము తారా నగర్ లో గల విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ నందు ప్రపంచ మహాసముద్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ రామాచారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ మరియు ఎట్మాస్ఫియర్ సైన్సెస్ విభాగపు ఆచార్యులు P శ్రీనివాస్ గారు విచ్చేసి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *మనం నివసించే భూ గ్రహంపై భూమి కేవలం 29% మాత్రమే. భూమి ఉపరితలంలో 71% భాగాన్ని ఆక్రమించిన జలాలు జీవావరణ సమతుల్యతను కాపాడటంలో, వాతావరణ నియంత్రణలో, జీవవైవిధ్య పరిరక్షణలో మరియు మానవ జీవితానికి అవసరమైన వనరులను అందజేయటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి"* అని అన్నారు. " *ఐక్యరాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ మహా సముద్ర దినోత్సవాన్ని ఒక నినాదంతో జరుపుతున్నారు. ఈ సంవత్సరం నినాదం ' _మనకు తెలిసిన ప్రపంచానికి మించి, మన సముద్రంతో కొత్త సంబంధం: పునఃసమీక్షించడం_ '.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సముద్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం, సముద్ర పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం మరియు భవిష్యత్తు తరాలకు ఆరోగ్య కరమైన సముద్రాలను అందించేందుకు సమిష్టి చర్యలకు పిలుపునివ్వడమే"* అని అన్నారు. " *భూమిపై ఉన్న మహాసముద్రాలు మన జీవనానికి ఎంతో కీలకం. ప్రపంచంలో మనం పీల్చే ఆక్సీజన్ లో గణనీయమైన భాగం సముద్రాల నుండే లభిస్తుంది. అంతేకాకుండా సముద్రాలు వాతావరణ సమతుల్యతను కాపాడుతూ కోట్లాది ప్రజలకు ఆహారము మరియు ఉపాధిని అందిస్తున్నాయి. నీరు లేకపోతే సకల జీవరాసులకు మనుగడ ఉండదు. నీరు అభివృద్ధికి చిహ్నం. ప్రపంచంలోని నాగరికతలు అన్నీ నదీ పరీవాహక ప్రాంతాలలోనే"* అని అన్నారు. " *అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాలు సముద్రాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అందుచేత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు, చమురు లీకేజీలు, మురుగునీరు మరియు వ్యవసాయ వ్యర్థాలు సముద్ర జీవ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది సముద్ర జీవులు (అనేక రకాల చేపలు, పగడపు దిబ్బలు, సముద్ర మొక్కలు, తిమింగలాలు, డాల్ఫిన్లు మరియు యితర జీవులకు నష్టము వాటిల్లుతుంది. సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటే దాని ప్రభావం మానవ జీవనంపై కూడా తీవ్రంగా ఉంటుంది. అందు వలన జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత యివ్వాలి. ప్రపంచ దేశాలు 2030 నాటికి కనీసం 30% సముద్ర ప్రాంతాలను సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. సముద్రాలను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుని సామాజిక బాధ్యత* " అని అన్నారు. " *ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైన విధంగా పారవేయడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా సముద్ర రక్షణకు తోడ్పడవచ్చు. సముద్ర సురక్షిత ప్రాంతాలను విస్తరించాలి. సముద్ర జీవవైవిధ్యాన్ని రక్షించాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలి. సముద్ర కాలుష్యాన్ని నిరోధించాలి. బీచ్ శుభ్రత కార్యక్రమాలలో పాల్గొనాలి. పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నీటి వనరులను సంరక్షించాలి. సముద్ర జీవాలను రక్షించే సంస్థలకు మద్దతు యివ్వాలి. సోషల్ మీడియాలో సముద్ర పరిరక్షణా సందేశాలను ప్రచారం చేయడం లాంటి చర్యలు చేపట్టి సముద్రాల పరిరక్షణకు మన వంతు సహాయ సహకారాలు అందించాలి. మనం నిత్యం ఒక సముద్రం - ఒక వాతావరణం - ఒక భవిష్యత్తు అనే నినాదాన్ని నిత్యము స్మరించుకుంటూ సముద్రాలను కాపాడుకుందాం* " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.