ఇల్లందు బుగ్గ వాగు బ్రిడ్జి బస్టాండ్ సెంటర్లో నిబంధనల ఉల్లంఘన: ఆదేశాలున్నా పట్టించుకోని అధికారులు
ఇల్లందు, జూన్ 08: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన బుగ్గ ఆగు బ్రిడ్జి బస్టాండ్ సెంటర్ లో ట్రాఫిక్ సమస్యలు, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై చేపల అమ్మకాలు (చేపల మార్కెట్) సాగించకూడదని గతంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. బుగ్గ వాగు బ్రిడ్జి బస్టాండ్ సెంటర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో చేపలు అమ్మడం వల్ల తీవ్రమైన దుర్వాసన వస్తోందని, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ఇక్కడ చేపలు అమ్మకూడదు" అని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కొంతమంది వ్యాపారులు వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు.అధికారుల అలసత్వంపై స్థానికుల ఆగ్రహం ఈ నిబంధనల ఉల్లంఘనపై స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేవలం ఆదేశాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల ఈ అలసత్వం వల్లే వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, బస్టాండ్ సెంటర్ లో రోడ్డుపై చేపల అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.