నాణ్యతలేని విత్తనాలు, పురుగుమందులు అమ్ముతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన
నాణ్యతలేని విత్తనాలు, పురుగుమందులు అమ్ముతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణా నాయక్ తీవ్ర హెచ్చరిక చేశారు. రైతులను మోసం చేసే వ్యాపారులపై వెంటనే కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“రైతే రాజు” అని ప్రభుత్వం ప్రతి సమావేశంలో చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం ప్రతి ఏడాది పంట నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాణ్యతలేని విత్తనాలు, నకిలీ పురుగుమందుల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఇకపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మే ప్రతి షాపులో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మండల పరిధిలోని దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యతలేని గింజలు లేదా మందులు విక్రయించినట్లు తేలితే ప్రజలతో కలిసి రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
“దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతును మోసం చేయడం అత్యంత దుర్మార్గమైన పని. రైతు బతికితేనే దేశం బతుకుతుంది” అని ధరావత్ కృష్ణా నాయక్ అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు పూర్తిగా పరిశీలించి, నాణ్యత ఉన్నవే కొనుగోలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయక్, నరేష్ నాయక్, కిషన్ నాయక్, హథీరామ్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.