బీజేపీకి సింగం అన్నామలై గుడ్బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎస్ మాజీ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లను కలిసి తన 5 పేజీల రాజీనామా లేఖను సమర్పించారు. కొద్ది రోజులుగా అన్నామలై తదుపరి అడుగులపై సాగుతున్న ఉత్కంఠకు ఈ నిర్ణయంతో తెరపడింది.
దిల్లీలో హైడ్రామా - లేఖలో ఏముంది?
గత ఆరేళ్లుగా తమిళనాట బీజేపీకి 'స్టార్' ఇమేజ్ తెచ్చిన అన్నామలై, తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఐదు పేజీల సుదీర్ఘ లేఖలో ఆయన పార్టీ కేంద్ర నాయకత్వంతో తనకు ఉన్న వ్యూహాత్మక విభేదాలను స్పష్టంగా ప్రస్తావించినట్లు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తో పొత్తు పెట్టుకోవాలన్న దిల్లీ పెద్దల నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ స్వతంత్రంగా ఎదగాలని తాను కోరుకుంటే, అధిష్ఠానం మాత్రం ద్రావిడ పార్టీలపై ఆధారపడటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
కొంపముంచిన కూటమి వ్యవహారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులో అన్నామలై అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది. తనకు కేవలం ఆరు స్థానాల బాధ్యతలు మాత్రమే అప్పగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. ఫలితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం, పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో అన్నామలై వాదన నిజమైంది. బీజేపీలో తనకు తగినంత స్వేచ్ఛ, భవిష్యత్తు లేవని భావించిన ఆయన, సుదీర్ఘ చర్చల అనంతరం కమలం గూటి నుంచి బయటకు రావడమే ఉత్తమమని భావించారు.
ఉపఎన్నికల్లో పోటీ.. సొంత పార్టీ దిశగా అడుగులు
అన్నామలై రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు, పైగా మరింత దూకుడు పెంచబోతున్నారు. రాబోయే ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లేదా సరికొత్త వేదిక ద్వారా పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. రాబోయే 6 నుంచి 8 నెలల కాలంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే యోచనలో ఆయన ఉన్నారు. తమిళ అస్థిత్వం - జాతీయ దృక్పథం అనే సరికొత్త స్లోగన్‌తో, ఒక సెక్యులర్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయడమే ఆయన తదుపరి కార్యాచరణగా తెలుస్తోంది.
ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి ఘనవిజయం సాధించడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే , బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త శక్తి వైపు యువత మొగ్గు చూపుతోందని అన్నామలై గమనించారు. బీజేపీ సిద్ధాంతాల ముద్ర వల్ల తమిళనాడులో ఎదగడం కష్టమని గ్రహించిన ఆయన, విజయ్ తరహాలోనే ద్రావిడ సంస్కృతి, అవినీతి రహిత పాలన అజెండాతో యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు యువ నిపుణులు, అసంతృప్త నేతలు ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.
తమిళనాడు బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఈ యువనేత, ఇప్పుడు బీజేపీ చట్రం నుంచి బయటకు వచ్చి ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. కోయంబత్తూరుతో సహా తమిళనాడు అంతటా ఆయన మద్దతుదారులు ఇప్పటికే అన్నామలై 2.0 పోస్టర్లతో హల్‌చల్ చేస్తున్నారు. మరి ఈ సింగం సొంతంగా పార్టీ పెట్టి ద్రావిడ కోటలను బద్దలు కొడుతుందో లేదో చూడాలి.