logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం.. వివరాలు ఇవే!

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.
కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ నియమకాలు ఖరారయ్యాయి. కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం. నూతనంగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ ఐదుగురు న్యాయమూర్తుల పూర్తి వివరాలు.

1. జస్టిస్ శీల్ నాగు: ఈయన మాతృ హైకోర్టు మధ్యప్రదేశ్. 1965 జనవరి 1న జన్మించిన జస్టిస్ శీల్ నాగు, 1987లో న్యాయవాదిగా నమోదై సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో ప్రాక్టీస్ చేశారు. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2013లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. పర్యావరణం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఈయన పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఈయన డిసెంబర్ 31, 2029న పదవీ విరమణ చేయనున్నారు.

2. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్: ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి 1993లో లాయర్‌గా ప్రయాణం ప్రారంభించారు. 2013లో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై, ఆపై రాజస్థాన్ మరియు బాంబే హైకోర్టులకు బదిలీ అయ్యారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు, మాలెగావ్ పేలుళ్ల కేసు వంటి అనేక హైప్రొఫైల్ కేసులను ఈయన బెంచ్ విచారించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జార్ఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేనందున ఈయన ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మే 24, 2030న రిటైర్ అవుతారు.

3. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా: ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 1995లో సుప్రీంకోర్టులో 'అడ్వకేట్-ఆన్-రికార్డ్'గా అర్హత సాధించి, 2011లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. 2013లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులైన ఈయన, ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండు దశాబ్దాల పాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టులో ఈయన పదవీకాలం సుమారు మూడున్నరేళ్లు ఉండనుంది.

4. జస్టిస్ అరుణ్ పల్లి: ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఈయన కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

5. సీనియర్ అడ్వకేట్ వి. మోహన: ఈ విడత నియామకాలలో నేరుగా బార్ (న్యాయవాదుల కోటా) నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైన ఏకైక సీనియర్ మహిళా న్యాయవాది వి. మోహన. సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా ప్రతిభావంతమైన న్యాయవాదిగా సేవలందించిన ఆమెను అత్యున్నత పీఠం వరించింది.

ఈ ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది. ఇది పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారానికి మరింత దోహదం చేయనుంది.

7
79 views

Comment