logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత్ భూభాగాన్ని నేపాల్ కూడా ఆక్రమించింది'.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

భారత్, నేపాల్ దేశాల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నేపాల్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 35 ఏళ్ల బాలెన్ షా..
ఆదివారం పార్లమెంటును ఉద్దేశించి తొలిసారి ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ సరిహద్దు ప్రాంతాల వివాదం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇంకా ఒక సమస్యగా మిగిలి ఉందన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. "నేను ప్రధాని అయిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది. భారత్ కేవలం నేపాల్ భూభాగాన్ని మాత్రమే ఆక్రమించలేదు, నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది" అని బాలెన్ షా పేర్కొన్నారు. ఇరు దేశాలు స్నేహితుల్లా కూర్చుని, నిపుణులు, చరిత్రకారుల సహాయంతో వాస్తవాలను అధ్యయనం చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో తాము చైనా, బ్రిటన్ (వలసరాజ్యాల చరిత్ర కారణంగా) దేశాలతో కూడా మాట్లాడామని పార్లమెంటుకు తెలిపారు.

ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపేలా మారడంతో, నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ప్రధాని వ్యాఖ్యలపై గంటల వ్యవధిలోనే వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని అన్న మాటలు ఇరు దేశాల సరిహద్దుల్లోని 'నో-మ్యాన్స్ ల్యాండ్' (Dasgaja areas), స్థానికుల అంతర్-సరిహద్దు భూ వినియోగానికి సంబంధించినవని స్పష్టం చేసింది. సరిహద్దు స్తంభాలు సరిగ్గా లేకపోవడం వల్ల నేపాల్ వైపు ఉన్న భూమిని కొందరు భారతీయులు, భారత్ వైపు ఉన్న భూమిని కొందరు నేపాలీయులు సాగు చేసుకుంటున్నారని, దీనినే ప్రధాని 'పరస్పర ఆక్రమణ' అని అన్నారని విదేశాంగ శాఖ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల టెక్నికల్ టీమ్‌లు సరిహద్దు స్తంభాల మరమ్మతులు, డేటా సేకరణపై పనిచేస్తున్నాయని తెలిపింది.

ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలపై నేపాల్ సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన బసన థాపా, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన రమేష్ మల్లా వంటి ప్రతిపక్ష నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. భారత్ భూభాగాన్ని నేపాల్ ఆక్రమించిందనడానికి ప్రధాని ఆధారాలు చూపించాలని, లేదంటే ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి సైతం ప్రధాని ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సరిహద్దు నిపుణుడు బుద్ధి నారాయణ్ శ్రేష్ఠ స్పందిస్తూ.. నేపాల్ ఎప్పుడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని, కేవలం సరిహద్దు పిల్లర్లు లేకపోవడం వల్ల రైతులు అటు ఇటు తిరుగుతూ భూములను వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. భారత్‌లో పనిచేసిన నేపాల్ మాజీ రాయబారులు నీలాంబర్ ఆచార్య, దీప్ కుమార్ ఉపాధ్యాయ్‌లు కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారత్ కూడా ఎప్పుడూ రికార్డుల్లో నేపాల్ ఆక్రమించిందని అనలేదని, ప్రధానికి సరైన సమాచారం లేదని వారు పేర్కొన్నారు.

భారత్ నిర్మించిన లిపులేఖ్ రహదారి ద్వారా 'కైలాస మానససరోవర యాత్ర' సాగడంపై కొన్ని వారాల క్రితమే నేపాల్ అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్, చైనాలకు దౌత్యపరమైన నిరసనలు పంపింది. 1816 నాటి 'సుగౌలి ఒప్పందం' ప్రకారం లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు నేపాల్‌వేనని ఆ దేశం గట్టిగా వాదిస్తోంది. అయితే భారత్ ఈ వాదనను తోసిపుచ్చింది. నేపాల్ కావాలనే ఏకపక్షంగా తన మ్యాప్‌ను విస్తరించుకుంటోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో భాగమైన ఈ ప్రాంతాల వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచి చెప్తోంది. గతంలో 2021లో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ దేశంలో కలుపుతూ కొత్త పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

0
24 views

Comment