logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం

హైదరాబాద్: ఫ్లాష్ ఇండియా ప్రతినిధి- పగిళ్ల సందీప్ 30/05/26
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కమిటీ ఛైర్మన్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగింది.కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, ఎం. కోదండరామ్, ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు ఉన్నతాధికారులతో కలిసి విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ, గుర్తింపు ప్రమాణాలపై చర్చించారు.తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న G.O.Rt.No.679 జారీ చేసిన నేపథ్యంలో కమిటీ మొదటిసారిగా సమావేశమైంది. జూన్ 4న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది.కమిటీ ఛైర్మన్ డా. కె. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, తొలి మరియు మలి దశ ఉద్యమకారుల వివరాలను సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జైలు శిక్షలు అనుభవించిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొన్న ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఆర్టీసీ మరియు సింగరేణి కార్మికులు తదితరుల సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల సేవలు, త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

18
503 views

Comment