ఇల్లంతకుంట PMGSY రహదారి పనులు పునఃప్రారంభం చేయాలి: కవంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల వినతి
హైదరాబాద్: ఎమ్మెల్యే డా. కవంపల్లి సత్యనారాయణ నివాసంలో వెల్జీపూరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. తంగళ్ళపల్లి నుండి ఇల్లంతకుంట వరకు PMGSY పథకం కింద చేపట్టాల్సిన రహదారి విస్తరణ పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
వెల్జీపూరం నుండి రహీంఖాన్‌పేట వరకు ఉన్న పాత రహదారి పూర్తిగా దెబ్బతింది. అధికారులు అంచనాలను సవరించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ, 2022 నుండి అనుమతులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే డా. కవంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్జీపూరం గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ గుండా వెంకన్న, AMC డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్, వార్డు సభ్యులు బొజ్జ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గండికోట సురేష్, సీనియర్ నాయకులు చిలువేరు స్వామి రెడ్డి, సోమిరెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.