ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన గళం!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 'ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక' లో జనసేన పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై గళమెత్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్, సూరజ్ ధనుంజయ్ మరియు స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ కు జనసేన నాయకులు నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ముస్లిం మైనారిటీలకు చెందిన షాదీ ఖానా మరియు ఈద్గా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముస్లిం సోదరుల సౌకర్యార్థం వీటికి వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. అలాగే ఉయ్యాలవాడ గ్రామం నుండి కొండపల్లె వరకు ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. వీటితో పాటు మిట్టపల్లె నుండి బాచేపల్లి పొలాల్లో గల రాస్తా సమస్యను కూడా పరిష్కరించి, రైతులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వన్ మంత్ – ఫోర్ విజిట్" మూడో దశలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో. జనసేన సమర్పించిన ఈ వినతిపత్రంపై జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అర్జీల్లోని సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ జనసేన పార్టీ జోన్ కమిటీ మెంబర్ MS మాబు హుస్సేన్, ఆళ్లగడ్డ జనసేన పార్టీ నాయకులు మిట్టపల్లి హుసేని, ఉయ్యాలవాడ దూదేకుల కొట్లో బాబు, రంగస్వామి, కమల్, సాధక్, జయ చంద్ర తదితరులు పాల్గొన్నారు.