logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముదిగొండ, మండలం: న్యూ లక్ష్మీపురంలో భారీ అగ్నిప్రమాదం.రూ.41 లక్షలకు పైగా ఆస్తి నష్టం.. అప్రమత్తంగా వ్యవహరించిన ఖమ్మం అగ్నిమాపక సిబ్బంది

ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రూ.41 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. పంట పొలాల్లోని వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, ఓ రైతు తన మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు అదుపుతప్పి పక్కనున్న ఆస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన కోరట్ల శివకు చెందిన ఆటోమొబైల్ పంచర్ షాపులో నిల్వ ఉంచిన సుమారు రూ.40 లక్షల విలువైన పాత, కొత్త టైర్లు, ట్యూబులు, రీ-బటన్ టైర్లు, డిస్కులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే వడ్డేపూడి ఎల్లయ్యకు చెందిన 500 వరి గడ్డి కట్టలు దగ్ధమై సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లగా, యలగందుల సాయిబాబా పొలంలోని టేకు చెట్లు, వ్యవసాయ మోటారు వైర్లు కాలిపోవడంతో మరో రూ.30 వేల మేర నష్టం సంభవించింనట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఖమ్మం అగ్నిమాపక దళం కేవలం 20 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అగ్ని పక్కనే ఉన్న ఇళ్లకు, ఇతర వరి గడ్డి వాములకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిమాపక చర్యల్లో ఖమ్మం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి. కోదండ రామిరెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ పి. కిరణ్ కుమార్, ఫైర్ ఫైటర్ అండ్ టెక్నికల్ వి. రాంబాబు, ఫైర్ ఫైటర్లు పి. భాస్కర్, జి. అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం._

5
88 views

Comment