తెలంగాణలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా జానపద భజన కార్యక్రమం
తెలంగాణ: ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పరంపరా ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సోమవారం సరస్వతి ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక జానపద భజన కార్యక్రమం ఘనంగా జరిగింది.
డాక్టర్ లింగశ్రీనివాస్ ఆధ్వర్యంలో "లోకకళా వికాస పరిషత్" సమర్పించిన ఈ కార్యక్రమంలో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రాచీన జానపద వాయిద్యాలను వినియోగించి సంప్రదాయ భజనను ఆవిష్కరించిన ఈ కళారూపం ఆధ్యాత్మికతతో పాటు జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. డాక్టర్ లింగశ్రీనివాస్ అలిండియా రేడియో B-హై గ్రేడ్ ఆర్టిస్ట్, కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందారు.
అమెరికా, కువైట్, మలేషియా వంటి దేశాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ DIET కళాశాలలో ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. ఈ బృందంలో నవీన్ కుమార్, వేణు, రఘు, లింగ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ భజన కార్యక్రమం పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే కాక తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబిస్తోంది.