మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయాలి-గాదె శివ
నకిరేకల్, మే 22: నకిరేకల్ టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ BRSV ఇన్‌చార్జ్ గాదె శివ మాట్లాడుతూ, గత కొంతకాలంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా రోస్టర్ నిబంధనలను పాటించకుండా, పారదర్శకత లేకుండా నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నప్పటికీ, వాటిపై స్పష్టత ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్రమ అరెస్టులతో భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థి నాయకులపై అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని, ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో వేధిస్తూ, విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించే విధంగా యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తోందని గాదె శివ మండిపడ్డారు. BRSV నాయకుడు వాడపల్లి నవీన్‌ను బైండోవర్ పేరుతో అరెస్టు చేయడం విద్యార్థులను భయపెట్టే చర్యేనని పేర్కొన్నారు.విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వీసీ, రిజిస్ట్రార్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని గాదె శివ డిమాండ్ చేశారు.