logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*బెజవాడలో జీప్లతో ఢీకొట్టుకొన్న యువకులు :* *పరుగులు తీసిన జనం* *యువతి వ్యవహారంలో మనస్పర్థలే కారణం :*

*బెజవాడలో జీప్‌లతో ఢీకొట్టుకొన్న యువకులు :*

*పరుగులు తీసిన జనం*

*యువతి వ్యవహారంలో మనస్పర్థలే కారణం :*

*ఎదురెదురుగా దూసుకొస్తూ...*

వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి.. నడిరోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునే వరకు వెళ్లింది. అవి ధ్వంసమైనా.. పగ, కసి చల్లారక.. దిగి కలియబడ్డారు.

ఈ ఘటన చూసి.. రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్‌ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడలో హైటెన్షన్‌ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది..

*సవాళ్లు విసురుకుని..*

తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి.విజయవాడలోని భారతీనగర్‌కు చెందిన బోల్లా ఓమ్‌.. తన తండ్రితో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇతను వైకాపా నేత జోగి రమేష్‌కు బంధువుగా చెప్పుకొనేవాడు. జగన్‌ పుట్టిన రోజును కూడా తాడేపల్లిలో తాను చదివే ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ఘనంగా చేశాడు. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాడు. ఓమ్, రోహిత్‌ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్‌కు ఓమ్‌ ఫోన్‌ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తాను పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్‌లోని హైటెన్షన్‌ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.

*ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ..*

ఓమ్‌.. తన థార్‌ జీప్‌పై రోహిత్‌ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్లాడు. రోహిత్‌ జీప్‌ను ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. యాక్షన్‌ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు.. భీతావహ దృశ్యాలను చూసి భయాందోళనలతో పరుగులు తీశారు. అప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీప్‌లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలకొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి జీప్‌ను వదిలేసి రోహిత్‌ పరారయ్యాడు. ఓమ్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు తెలిసింది.

3
67 views

Comment