logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు - గుర్తింపు పత్రాలు తప్పనిసరి తనిఖీ చేయాలి -ఆధార్ లింక్ సెల్ నంబర్లను క్రాస్ చెక్ చేయాలి

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు

- గుర్తింపు పత్రాలు తప్పనిసరి తనిఖీ చేయాలి

-ఆధార్ లింక్ సెల్ నంబర్లను క్రాస్ చెక్ చేయాలి

- జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్

జగిత్యాల జిల్లా ప్రతినిధి - చుక్క గంగారెడ్డి, 2026 మే 20 :

అనుమానస్పద వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు లాడ్జ్ గదులు అద్దెకు ఇవ్వకూడదని జగిత్యాల టౌన్ సి. ఐ. కరుణాకర్ అన్నారు. బుధవారం ఆయన శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ లాడ్జ్‌లలో గదులు కేటాయించే ముందు ప్రతి ఒక్కరి నుండి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. వారి పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి భద్రపరచాలని తెలిపారు. ఆధార్ లింక్ ఉన్న సెల్ నంబర్ల ను క్రాస్ చెక్ చేయాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లాడ్జ్ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రవేశ ద్వారాలు, రిసెప్షన్, పార్కింగ్ ప్రదేశాలు, కారిడార్లలో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని తెలిపారు. సీసీ ఫుటేజ్ కనీసం కొంతకాలం భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులకు లేదా సరైన గుర్తింపు పత్రాలు లేని వారికి గదులు కేటాయించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం వలన నేరాలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉన్నందున లాడ్జ్ యజమానులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన లాడ్జ్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. పట్టణ భద్రతలో లాడ్జ్ నిర్వాహకుల సహకారం అత్యంత కీలకమని, ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

1
0 views

Comment