logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పత్రిక ప్రకటన కామారెడ్డి జిల్లా తేదీ: 20-05-2026 పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యం: రాజకీయ పార్టీల సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్


కామారెడ్డి జిల్లా
తేదీ: 20-05-2026

పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యం: రాజకీయ పార్టీల సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్

ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం మరియు రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యంగా ఉండాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని, అధికారులు మరియు రాజకీయ నాయకులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని, జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు.
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపడతారని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు.
బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం
కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షుణ్ణంగా విచారణ చేసిన అనంతరం మాత్రమే కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారని తెలిపారు.
స్థానికంగా మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం వంటి బాధ్యతలు బీఎల్ఓలపై ఉంటాయని స్పష్టం చేశారు.
కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కూడా స్పష్టతనిస్తూ, ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
01-10-2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

6
315 views

Comment