logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దివ్యాంగుడికి ఐదు నెలలుగా రేషన్ బియ్యం అందక ఆవేదన

దివ్యాంగుడికి ఐదు నెలలుగా రేషన్ బియ్యం అందక ఆవేదన
అధికారుల నిర్లక్ష్యంపై మీడియా ముందు కన్నీటి పర్యంతమైన ముని వెంకటప్ప
చిత్తూరు జిల్లా వీకోట మండలం పాముగానిపల్లి పంచాయతీ గుమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు ముని వెంకటప్పకు గత ఐదు నెలలుగా రేషన్ బియ్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై పలుమార్లు ఎమ్మార్వో, తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించినప్పటికీ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా పొంతనలేని వివరణలు చెబుతున్నారని ముని వెంకటప్ప ఆరోపించారు. తన సమస్యను పరిష్కరించాలంటూ వేడుకున్నప్పటికీ స్పందన లేకపోవడంతో మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.
“నేను దివ్యాంగుడిని. జీవనోపాధి కూడా సరిగా లేదు. ఐదు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు,” అంటూ ఆయన వాపోయారు.
దివ్యాంగుడి ఆవేదనపై వెంటనే స్పందించి, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించి రేషన్ బియ్యం అందజేయాలని గ్రామస్థులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

5
262 views

Comment