ఎస్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం, వడదెబ్బపై వైద్యాధికారుల అవగాహన
పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు మంగళవారం క్రోసూరులోని ఎస్టీ కాలనీలో క్రోసూర్ పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మే 19 నుండి 24 వరకు వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యాధికారులు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే గొడుగు, టోపీ, తలపాగా వంటివి ధరించాలని, అలాగే ఎక్కువ మొత్తంలో మంచినీరు, ద్రవాహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ శివుడు, ఆరోగ్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.