సైలెంట్ కిల్లర్ రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆదివారం క్రోసూరులో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు. అధిక రక్తపోటుకు సాధారణంగా ఎటువంటి స్పష్టమైన లక్షణాలు ఉండవని, అందుకే దీనిని "సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి సాధారణ రక్తపోటు 120/80 mmHg గా ఉండాలని, ప్రస్తుతం ఒక వ్యక్తి బీపీ నిరంతరంగా 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా గుర్తిస్తారని వివరించారు. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బీపీని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చని, రోజువారి ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించడంతో పాటు పండ్లు, ఆకుకూరలు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం చేయాలని, పొగత్రాగడం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఒత్తిడిని అధిగమించడం, రక్తపోటు సంఖ్యలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. 2026 ప్రపంచ రక్తపోటు దినోత్సవం యొక్క థీమ్ "కంట్రోలింగ్ హైపర్ టెన్షన్ టుగెదర్" (అధిక రక్తపోటును కలిసి నియంత్రిద్దాం!) అని తెలిపిన ఆయన, మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఉచిత రక్తపోటు పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.