సమాచారం ఇవ్వడంలో మీరు కూడా సిటిజన్ గా ఆలోచించండి
రెండో అప్పీల్ కు రాకుండా చూడండి
ఇక నుండి పెనాల్టీలు తప్పవు
ఆర్టీఐ అవగాహన సదస్సులో సమాచార కమీషన్
సమాచారం ఇవ్వడంలో మీరు కూడా సిటిజన్ గా ఆలోచించండి
రెండో అప్పీల్ కు రాకుండా చూడండి
ఇక నుండి పెనాల్టీలు తప్పవు
ఆర్టీఐ అవగాహన సదస్సులో సమాచార కమీషన్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) మే 16:
ప్రజలు వారి - వారి అవసరాల రీత్యా సమాచార హక్కు చట్టం - 2005 ద్వారా కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో సహాయ, ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అధికారులు మీరు కూడా సిటిజన్ గానే ఆలోచించి నిర్ణీత గడువు కాలంలోపే సమాచారం అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించింది.
జగిత్యాలలోని జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో శనివారం జిల్లాలోని వివిధ శాఖల సహాయ, ప్రజా సమాచార అధికారులకు, మొదటి అప్పీలేట్ అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఇట్టి సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార చీఫ్ కమీషనర్ జి.చంద్ర శేఖర్ రెడ్డి, కమీషనర్ లు పివి శ్రీనివాస్ రావు, డి.భూపాల్ లు హాజరయ్యారు. ముందుగా వారి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ లు బి.ఎస్.లత, బి.రాజగౌడ్ లు ఘన స్వాగతం పలికి పూల మొక్కలు బహుకరించి వారిని ఆహ్వానించారు. ప్రత్యేక బెటాలియన్ పోలీస్ బృందం చే గౌరవ వందనం స్వీకరించారు. సమాచార హక్కు చట్టం - 2005 పై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. సమాచారం ఇవ్వాల్సిన అధికారుల తో పలు అనుమానాలను రేకెత్తించి వాటిని నివృత్తి పరిచారు. చట్టం పై ప్రశ్నావళితో చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కమీషనర్, కమీషనర్ లు మాట్లాడుతూ గత ఏడాది కాలంలో 18 వేల పై చిలుకు కేసులను విచారణ జరిపామన్నారు. జిల్లాలోని అధికారులు ఇకనుండి రెండో అప్పీల్ కు రాకుండా మొదటి అప్పీల్ లోపే ప్రజలకు కోరిన సమాచారం అందజేసి ఉద్యోగ బాధ్యతల్లో పారదర్శకత ప్రదర్శించాలన్నారు. లేని పక్షంలో ఇక నుండి రెండో అప్పీల్ కేసులన్నింటిపై పెనాల్టీలు, శిక్షలు, తగు పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మొదటి అప్పీల్ సమయంలోనే కేసుల విచారణ జరిపి మీ - మీ కార్యాలయాల్లోనే సమాచార హక్కు చట్టం దరఖాస్తుల సమస్యలను పరిష్కరించుకోవాలని సమాచార కమీషన్ సూచించింది. అనంతరం ముగ్గురు కమీషనర్ లు వేర్వేరుగా జిల్లాలోని వివిధ శాఖలకు సంబందించిన రెండో అప్పీల్ కేసులను విచారించి తగు ఆదేశాలు జారీ చేశారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పలు శాఖల అధికారులను సమాచార కమీషన్ తమదైన శైలిలో గట్టిగా మందలించినట్లు తెలిసింది. కొన్ని శాఖల అధికారులు విచారణకు రాకపోవడంతో సంబంధిత అధికారులచే ఫోన్ లు చేయించి రప్పించి చీవాట్లు పెట్టి విచారణ జరిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ లతో పాటు కలెక్టరేట్ సిబ్బంది సమాచార కమీషన్ కు ఘన వీడ్కోలు పలికారు. ప్రత్యేక బెటాలియన్ పోలీస్ లు మళ్ళీ గౌరవ వందనంతో వీడ్కోలు పలికారు.
సీనియర్ ఆర్టీఐ కార్యకర్తలు చుక్క గంగారెడ్డి, ఐల చంద్ర ప్రకాష్, వూత్తూరి అన్నయ్య, మేకల అక్షయ్ కుమార్ తదితరులు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ లను ప్రత్యేకంగా కలిసి జిల్లా సమస్యలపై, జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై వివరించారు.