నాడు జగన్ హయాంలో వ్యవసాయం నిర్వీర్యం.. రైతులపై వైసీపీ మొసలి కన్నీరు: బీజేపీ నేత డాక్టర్ ఏలూరి మండిపాటు
పొగాకు రైతులను గతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. మార్కాపురంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పులపాలైనప్పుడు అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో రైతులకు అండగా నిలుస్తూ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు, మార్కెటింగ్, కొనుగోలు అంశాల్లో భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ రైతులకు సాంకేతిక సహాయం, మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న వైసీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని, గతంలో సమస్యలపై స్పందించని వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.