సామాన్యులకు రాజకీయ గుర్తింపు ఎల్జేపీతోనే సాధ్యం: పల్నాడు జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలికి, సామాన్య యువత నాయకులుగా ఎదగాలంటే అది ఎల్జేపీ ద్వారానే సాధ్యమని, యువత అధిక సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆశయాలకు అనుగుణంగా గత ఏడాది కాలంలో తుపాన్ బాధితుల సహాయార్థం, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్యలు, విద్యా, వైద్య రంగాల్లో అవగాహన సదస్సులు వంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్తులో ప్రజల గొంతుకై మరిన్ని పోరాటాలు చేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.