ఆళ్లగడ్డలో ఒక్కరోజే 458 అర్జీలు.ఇన్నాళ్లూ యంత్రాంగం ఏం చేస్తోంది? జిల్లా కలెక్టర్
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా కలెక్టర్ దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఇన్నాళ్లూ క్షేత్రస్థాయి యంత్రాంగం ఏం చేస్తోంది?అని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా అధికారులను నిలదీశారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వన్ మంత్ - ఫోర్ విజిట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల వెల్లువ చూసి ఆమె విస్మయం వ్యక్తం చేశారు.ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే ఒకే రోజు 458 అర్జీలు రావడంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.అందిన అర్జీల్లో 60 శాతానికి పైగా భూ సమస్యలే ఉన్నాయని, అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇవి ఇన్ని రోజులు పెండింగ్లో ఉండేవి కావని స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును 21 రోజుల్లోపు పరిష్కరించాల్సిందేనని, తప్పుడు నివేదికలు ఇచ్చినా లేదా కాలయాపన చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు.
దూర ప్రాంతాల నుండి నంద్యాల రావడం ప్రజలకు భారమవుతోందని, అందుకే తామే ప్రజల వద్దకు వస్తున్నామని, దీనిని అధికారులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా పనులు అయ్యేవి కావని, ఇప్పుడు అధికారులే ప్రజల వద్దకు రావడం శుభపరిణామమని అన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని, ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని ఆమె కోరారు.వచ్చే శుక్రవారం నాటికి కనీసం 450 అర్జీలకు సంబంధించి పరిష్కార పత్రాలను సిద్ధం చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.