పేద విద్యార్థులకు అండగా కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి: స్కాలర్షిప్ల పంపిణీ
గుంటూరు (జెకేసీ కాలేజీ రోడ్డు):
"సమాజంలో మనిషి ఉన్నతికి విద్యే అసలైన ఆయుధం" అని కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి నిర్వాహకులు పేర్కొన్నారు. జెకేసీ కాలేజీ రోడ్డులోని గార్డెన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు మిత్ర మండలి తరపున సత్కారం మరియు స్కాలర్షిప్ల పంపిణీ జరిగింది. 10వ తరగతిలో 94 శాతం మార్కులు సాధించిన ఎస్డి. మహమ్మద్ ఇమ్రాన్, 97 శాతం సాధించిన టి. సత్యప్రసాద్లను అతిథులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంతో చదవాలని, అప్పుడే ఐఏఎస్, ఐపిఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత స్థానాలకు చేరుకోగలరని ఆకాంక్షించారు. సమాజంలో కేఎస్ఆర్ వంటి సేవాతత్పరుల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏల్చురి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేఎస్ఆర్ గారు విద్య, వైద్య రంగాలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడారు. స్కూళ్లకు ల్యాప్టాప్లు, డిజిటల్ టీవీలు, ప్రొజెక్టర్లు అందించడంతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ 'ఆంధ్ర రత్న', 'సామజిక సేవా రత్న' వంటి పురస్కారాలకు ఆయన వన్నె తెచ్చారని పేర్కొన్నారు.
మిత్ర మండలి చైర్మన్ కేఎస్ఆర్ మాట్లాడుతూ.. నేతాజీ మిత్ర మండలి ద్వారా విద్య, వైద్య రంగాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మిర్చి యార్డ్ డైరెక్టర్ ప్రగతి వెంకటేశ్వరావు, పావులూరి చిన్న సుబ్బారావు, డైరెక్టర్లు పిడికిటి శ్రీనివాస్, శివాజీ, జాస్తి చంద్రశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు సయ్యద్ బాషా, టి. సాయిరాం తదితరులు పాల్గొన్నారు.