సిద్ధం వేణు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తీవ్ర విమర్శలు
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రైతుల ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
రోహిణి కార్తె సమీపిస్తున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యుద్ధపరిస్థితుల్లో ధాన్యం తూకం వేసి మిల్లులకు తక్షణం తరలించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాత్కాలికంగా ఇసుక రవాణాను నిలిపి ధాన్యం తరలింపుకు లారీలు కేటాయించాలని, ప్రతి కేంద్రానికి కనీసం రెండు లారీలు పంపించాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు చేరుకుపెళ్లి రాజిరెడ్డి, ఉపసర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు ఎండి సాదుల్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ తదితరులు పాల్గొన్నారు.