నీట్ లీకేజీ మిస్టరీ.. ప్రింటింగ్ ప్రెస్ లోనే అసలు కథ మారిందా?
551 నగరాలు.. విదేశాల్లోని 14 సిటీలు.. 22.79 లక్షల మంది విద్యార్థులు 5,432కు పైగా కేంద్రాలు 6 వేల మందికి పైగా అబ్జర్వర్లు.. పరీక్ష సజావుగా సాగేలా 2 లక్షలకు పైగా సిబ్బంది..ప్రపంచంలోనే అతిపెద్ద ఎంట్రన్స్ టెస్టుల్లో ఒకటి.. నీట్ 2026 పరీక్షకు సంబంధించిన లెక్కలివి.. ఇంత కసరత్తు చేసి ఏం లాభం? పేపర్ లీక్ తో పరీక్ష కాస్తా నీరుగారిపోయింది. ఏకంగా రద్దే చేశారు.. ఎంత దారుణమిది?
విద్యార్దులకు షాక్..
ఎంత దారుణం? దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ నీట్ గా లీకైంది. పరీక్ష రాసిన 22 లక్షల 79 వేల మంది విద్యార్థులకు ఇది షాకింగే. ఏళ్ల తరబడి స్కూల్ ఫౌండేషన్ నుంచే డాక్టర్ అవుదామని ఎన్నో ఆశలతో, కలలతో సిస్టమాటిక్ గా ప్రిపేర్ అయిన వారికి తీవ్రమైన ఆందోళన కలిగించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.1 లక్షల ఎంబీబీఎస్ సీట్లు, 22.79 లక్షల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. కానీ సీరియస్ గా ప్రిపేర్ అయిన వారి కల 9 రోజుల్లోనే కరిగిపోయింది. మే 3 న నిర్వహించిన నీట్ ఎగ్జామ్ రద్దవడం కలకలం సృష్టించింది. మళ్లీ ప్రిపరేషన్, మళ్లీ ఎగ్జామ్ రాయడం, మళ్లీ క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం.. ఇదంతా పెద్ద టాస్క్. వీటికి తోడు మరింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం అన్నిటికంటే బిగ్ టాస్క్.
పరీక్ష నిర్వాహణపై డౌట్లు..
నీట్ గెస్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం సెంట్రల్ ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పరీక్ష నిర్వహణపై డౌట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షల మంది విద్యార్థులకు ఈ నిర్ణయం పిడుగుపాటే. ప్రభుత్వం వెంటనే CBI దర్యాప్తు ఆదేశించింది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్యశాస్త్రంలో ఓ మాట ఉంటుంది. చికిత్స కంటే నివారణే మేలు అని. పరీక్ష లీక్ అయ్యాక దర్యాప్తుల కంటే.. జరగకముందే పకడ్బందీగా నిర్వహించడం మనతో కాదా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.
రోగుల ప్రాణాలతో చెలగాటమా..
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. దీంతో ఈ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు కేటాయించడం అంటే రోగుల ప్రాణాలతో చెలగాటమే. ఇదో సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అన్ని రంగాలు వేరు. మెడికల్ విభాగం వేరు. అందుకే ఈ పరీక్షను కొనసాగించడం సాధ్యం కాదు అని NTA అధికారిక ప్రకటనలో చెప్పింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం పరీక్ష రద్దు తప్పలేదు. గెస్ పేపర్ లీక్పై CBI దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది.
సిబిఐ దర్యాప్తు..
పరీక్షకు ముందు గెస్ పేపర్ ఎలా ప్రచారం అయిందన్న కోణంలో CBI దర్యాప్తు చేస్తోంది. NTA అన్ని రికార్డులు, డేటా, సమాచారం అందిస్తామని చెప్పింది. రీ-ఎగ్జామ్ పై కొత్త తేదీలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది తీవ్రమైన నష్టమే అని NTA అంగీకరించింది. కానీ ఇలాగే అడ్మిషన్ల దాకా వెళ్తే భవిష్యత్ లో ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పింది. రీ ఎగ్జామ్ కోసం కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఫీజు రీఫండ్ చేస్తారు. విద్యార్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న హాల్ టిక్కెట్ల ఆధారంగా కొత్తవి జారీ చేస్తారు. ఇంతకు ముందు ఎంచుకున్న ఎగ్జామ్ సెంటర్లనే ఆప్షన్ గా ఇస్తారు. నీట్ రద్దు అనగానే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. సో అధికారిక NTA అప్డేట్లు మాత్రమే స్టూడెంట్స్ చూస్తే బెటర్. ఇప్పటికే జరిగిన ప్రిపరేషన్ను అందుకు తగ్గట్లు సర్దుబాటు చేసుకొని రెడీగా ఉండడం ఇంపార్టెంట్.
పేపర్ లీక్ వెనుక కొత్త నిజాలు
నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయ్. రాజస్తాన్ లోని సికార్ కోచింగ్ సెంటర్లలో మొదట గెస్ పేపర్ గా తెరపైకి వచ్చింది ఈ క్వశ్చన్ పేపర్. దాన్ని లెక్చరర్లు ప్రాక్టీస్ కూడా చేయించారు. చాలా ప్రశ్నలు అసలు క్వశ్చన్ పేపర్ తో అచ్చుగుద్దినట్లు సరిపోలాయ్. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. అనుమానాస్పదమైన గెస్ పేపర్ గురించి గుసగుసలుగా మొదలైన విషయం, ఇప్పుడు భారత్ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుతో కథ ముగిసింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్షను మే 3న నిర్వహించారు. జీపీఎస్ ట్రాకర్లు పెట్టి, పేపర్ల రవాణా చేశారు. బయోమెట్రిక్ ఐడెంటిఫై చేయించారు. ఏఐ బేస్డ్ సీసీటీవీ పర్యవేక్షణ పెట్టారు. పరీక్షా కేంద్రాల్లో 5జీ జామర్లు పెట్టారు. పూర్తి సేఫ్టీ ప్రోటోకాల్ మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. కానీ ఏ లాభం? పరీక్ష సాధారణంగానే సక్సెస్ ఫుల్ గా జరిగిందని అంతా అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు సినిమా మే 3న పరీక్ష జరిగిన తర్వాత క్వశ్చన్ పేపర్లను స్టూడెంట్స్ అనలైజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత డౌట్లు పెరిగాయి.
తెరపైకి ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్
మే 6-7 మధ్యలో.. విద్యార్థులు ప్రశ్నల సారూప్యతలను గమనించడం ప్రారంభించారు. అంటే చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన గెస్ పేపర్ చుట్టూ డౌట్లు మెల్లమెల్లగా మొదలయ్యాయ్. ఆన్లైన్లో ఆన్సర్ కీలు, క్వశ్చన్ పేపర్ అనాలసిస్ లతో, అసలు పరీక్షను పోలి ఉందని చెబ్తున్న గెస్ పేపర్ గురించి విద్యార్థులు, కోచింగ్ వర్గాల్లో చర్చ మొదలైంది. దర్యాప్తు అధికారుల ప్రకారం, పరీక్షకు ముందు ముఖ్యంగా రాజస్థాన్లో చేతితో రాసిన ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ తెరపైకి వచ్చింది. నిజానికి అసలైన క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీస్తే దాని వాటర్ మార్క్ ప్రకారం ఈజీగా ఎక్కడ లీకైందో కనిపెట్టేస్తారు. కానీ అనూహ్యంగా రాజస్తాన్ లో చేతితో రాసిన క్వశ్చన్ పేపర్ రావడంతో తెరవెనుక భారీ స్కెచ్ వేశారని అర్థం చేసుకోవచ్చు. హ్యాండ్ రిటెన్ గా ఉంటే ఎవరికీ డౌట్ రాదు. ఎక్కడ లీకైందో తెలియదన్న మాట.
42 గంటల ముందే NEET పేపర్ బయటకు?
నిజానికి ఎగ్జామ్ మే 3న జరిగితే.. అందుకు 42 గంటల ముందు పేపర్ బయటికొచ్చిందంటున్నారు. అంటే రెండు రోజుల ముందున్న మాట. వాస్తవంగా చూస్తే రెండు రోజుల ముందు గెస్ పేపర్ ఎవరైనా ప్రాక్టీస్ చేయించాలనుకుంటే చివరి నిమిషంలో ప్రింటెడ్ క్వశ్చన్ పేపరే ఉంటుంది. చేతి రాతతో ఎవరూ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవ్వరు. కానీ అదే జరిగింది. ఇది పెద్ద డౌట్. గెస్ పేపర్ కు, ఒరిజినల్ పేపర్ కు ఎక్కడో లింక్ కలిసిందన్న విషయం NTA కు మే 7న అందింది. లీకేజ్ సమాచారం NTAకు అందాక ఈ విషయాన్ని రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుండి గుర్తించినట్లు ఆ ఏజెన్సీ తెలిపింది. అధికారులు ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నారు. మే 8న ఈ లీక్ విషయం కాస్తా కేంద్ర ఏజెన్సీల దృష్టికి వెళ్లింది. తాము దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నామని, పరీక్షకు సంబంధించిన డేటా, సాంకేతిక సమాచారాన్ని పంచుకుంటున్నామని NTA తెలిపింది. ఈ దశలో పేపర్ లీక్పై ఎలాంటి అధికారిక నిర్ధారణ జరగలేదు.
NEET 2026 లీక్ కేసులో సంచలన ట్విస్ట్
సీన్ కట్ చేస్తే మే 10న రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ విచారణతో మ్యాటర్ మొత్తం బహిరంగమైంది. నీట్ యూజీ 2026కు సంబంధించిన అవకతవకలపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ -SOG బహిరంగంగా ధృవీకరించడంతో ఈ వివాదం కాస్తా దేశవ్యాప్తంగా అలజడికి కారణమైంది. పరీక్షకు ముందే 400కు పైగా ప్రశ్నలు బయటికి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు కనుక్కున్నారు. బయాలజీ, కెమిస్ట్రీల్లో వచ్చిన ప్రశ్నల్లో 100కు పైగా గెస్ పేపర్ తో మ్యాచ్ అయ్యాయి. దర్యాప్తు అధికారులు రాజస్తాన్ లోని సికార్ సహా ఇతర ప్రాంతాలు డెహ్రాడూన్లో కూడా సోదాలు, విచారణలు చేశారు.
మే 11న మరో బాంబు
మే 11న మరో బాంబు పేలింది. నీట్ లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 180 రాయాల్సి ఉంటుంది. అంటే ఈ 180 క్వశ్చన్స్ లో 135 ప్రశ్నలు సరిపోలాయనే వాదనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయ్. గెస్ పేపర్, నీట్ పేపర్ లో 135 ప్రశ్నలు సేమ్ టూ సేమ్ ఉన్నాయని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు గుర్తించాయి. ప్రచారంలో ఉన్న మెటీరియల్లో మొత్తం 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నీట్ మొత్తం 720 మార్కులకు గాను ఈ ప్రశ్నలు దాదాపు 600 మార్కులకు కవర్ చేస్తాయి. అందుకే ఈ పరీక్షను NTA రద్దు చేసింది.
రాజకీయాల్లో కొత్త మలుపు
ఈ ఎపిసోడ్ కాస్తా రాజకీయ మలుపు తీసుకుంది. పరీక్షకు ముందే నీట్ ప్రశ్నపత్రాలను అమ్ముతున్నారని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయంపై ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ రాహుల్ గాంధీ X లో ఆరోపించారు కూడా. ప్రధాని మోడీ అమృతకాలం కాస్తా- దేశానికో విషవలయంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివిన పిల్లలకు, పైసా పైసా కూడబెట్టి ఖర్చు చేసిన తల్లిదండ్రులకు తీరని కష్టమన్నారు. 2024లో కూడా నీట్ ఎగ్జామ్ లో ఇలాంటి కుంభకోణమే జరిగింది. ఆ నాటి ఎపిసోడ్ ను తాజా ఎపిసోడ్ గుర్తుకు తెచ్చినట్లైంది. సంవత్సరాల తరబడి పరీక్షకు ప్రిపేర్ అయిన వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటి నుండి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడింది.
పెన్ పేపర్ విధానమే లీకేజీలకు కారణమా?
అసలు పెన్ పేపర్ విధానంలోనే అసలు లీకేజీలు కనిపిస్తున్నాయ్. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టుల్లో పేపర్ ప్రింటింగ్ అని, ట్రాన్స్ పోర్ట్ అని, సిగ్నల్ జామింగ్ ఇలాంటివేమీ ఉండవు. నీట్ క్వశ్చన్ పేపర్ రూపకల్పన, ప్రింటింగ్, భద్రతకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత రహస్యమైన, మల్టీ లేయర్డ్ విధానాన్ని ఫాలో అవుతుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఐఐటీ నిపుణులు, సీనియర్ NCERT లెక్చరర్ల నుంచి విడివిడిగా వేల సంఖ్యలో ప్రశ్నలను NTA సేకరిస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారు. ప్రశ్నలు తయారు చేసే ఏ ఒక్క లెక్చరర్కు కూడా తాము ఇచ్చిన ప్రశ్నలు అసలు పరీక్షలో వస్తాయా లేదా అనేది తెలియదు. వారి నుంచి కేవలం ర్యాండమ్ గా మాత్రమే క్వశ్చన్స్ ను సేకరించి సెంట్రల్ డేటాబేస్లో భద్రపరుస్తారు.
AIతో పేపర్ సెట్ చేసినా.. లీక్కు చెక్ పడలేదా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా డిఫికల్టీ, ఈజీ, మీడియం లెవెల్ ప్రశ్నలు కలిగిన దాదాపు 10 వేర్వేరు క్వశ్చన్ పేపర్ సెట్లను ప్రాథమికంగా డిజిటల్ రూపంలో రెడీ చేస్తారు. ఇది రెండో స్టెప్. ఈ 10 సెట్లలో ఏ సెట్ను పరీక్షకు వాడాలనే ఫైనల్ నిర్ణయాన్ని పరీక్ష జరగడానికి కేవలం కొన్ని గంటల ముందు ఎన్టీఏ ఉన్నతాధికారుల సమక్షంలో అత్యంత రహస్యంగా అది కూడా లాటరీ లేదా రాండమ్ సెలక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా ఓకే చేస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎల్లప్పుడూ రెండు లేదా మూడు బఫర్ సెట్లను కూడా ముందే రెడీగా ఉంచుతారు. ఇంతా చేస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రింటింగ్ స్టేజ్ అనేది ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన వీక్ పాయింట్ ఇదే. అంతకు ముందు స్టెప్ లలో ఎంత సీక్రెట్ మెయింటేన్ చేసినా ప్రింటింగ్ దగ్గరికి వచ్చే సరికి కథ మొత్తం మారిపోతోంది. డిజిటల్ సేఫ్టీ ఎంత ఉన్నప్పటికీ, లక్షల సంఖ్యలో పేపర్లను ఫిజికల్ గా ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ లేదా ప్రభుత్వ భద్రతా ప్రింటింగ్ ప్రెస్లపై ఆధారపడవలసి వస్తుంది.
మొబైల్ ఫోన్లతో బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలా?
గతంలో జరిగిన కొన్ని దర్యాప్తులలో ఉదాహరణకు 2024 వివాదాల సమయంలో కొన్ని లీకేజీ మూలాలు ప్రింటింగ్ ప్రెస్లలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు లేదా రవాణా చేసే సిబ్బంది ద్వారానే పేపర్లు మొబైల్ ఫోన్ల రూపంలో బయటకు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. మానవ తప్పిదం లేదా అవినీతికి ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంటోంది. అయినప్పటికీ ప్రింటింగ్ పంపిణీ సమయంలో లోపాలను అరికట్టడానికి NTA కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్లను ప్రత్యేక ట్రంక్ పెట్టెల్లో ఉంచి, వాటికి జీపీఎస్ ట్రాకర్లు, అలాగే డిజిటల్ లాకులను అమర్చుతారు. ఈ బాక్సులు నిర్ణీత సమయానికి, నిర్ణీత పరీక్షా కేంద్రంలో మాత్రమే ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వాడుతారు.
ఇన్ని భద్రతల మధ్య NEET లీక్ ఎలా?
ప్రతి ప్రశ్నాపత్రంపై ఒక ప్రత్యేకమైన వాటర్మార్క్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫోటో తీసి బయటకు పంపినా, అది ఏ కేంద్రం నుండి లీక్ అయిందో నిమిషాల్లో కనిపెట్టవచ్చు. ప్రింటింగ్ ప్రెస్ నుండి తరలించిన పేపర్లను నేరుగా పరీక్షా కేంద్రాలకు పంపరు. పరీక్షకు రెండు మూడు రోజుల ముందు వాటిని జిల్లాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కెనరా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్లలో కస్టడీలో ఉంచుతారు. పరీక్ష రోజు ఉదయం మాత్రమే మేజిస్ట్రేట్ సమక్షంలో వాటిని బయటకు తీస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా లీకేజీలను అడ్డుకోవడానికి కేంద్రాల వద్ద 5G సిగ్నల్ జామర్లు, ఏఐ సీసీటీవీ కెమెరాలు , బయోమెట్రిక్ తనిఖీలను నిర్వహిస్తారు. మరి ఇంత చేశాక ఎక్కడ లీకైందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రశ్నా పత్రాల ప్రింటింగ్ ముందు, ప్రింటింగ్ తర్వాత కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి. అయితే లక్షల సంఖ్యలో క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసేటప్పుడు కథేంటన్నదే తేలాల్సిన మ్యాటర్. ఇన్ని లక్షల ప్రింట్లను పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అన్న డౌట్లు వస్తున్నాయ్. ఇక్కడే లీకేజీ ముఠాలు చేతికి పని చెప్పాయా మరెక్కడైనా లీక్ జరిగిందా అన్నది సీబీఐ తేల్చబోతోంది.