logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - అంతర్జాతీయ నర్సుల దినోత్సవము.......

తేదీ: 12-05-2026: శేరిలింగంపల్లి, చందానగర్:
ఈరోజు ఉదయం లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమీపంలో గల పద్మా అపార్ట్ మెంట్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి క్రొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ R. పుట్టరాజు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, BHEL జనరల్ హాస్పిటల్ అతిథులుగా డాక్టర్ B.C.రామన్న సత్యసాయి సేవాసమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్, E. దేవానంద్ యాదవ్ సోషల్ వర్కర్ విచ్చేసి మాట్లాడుతూ " *ప్రపంచ ఆరోగ్యసంస్థ వారు మే12వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 'మన నర్సులు - _మన భవిష్యత్తు - సాధికారులైన నర్సులు మన ప్రాణాలను కాపాడతారు'_ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. మానవులకు సేవ చేయడానికి భగవంతుడు కల్పించిన అవకాశమే వైద్య రంగం. దీనిలో ప్రధానమైంది నర్సింగ్ వృత్తి. రోగులకు వైద్యులు యిచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవకూడా అంతే ముఖ్యం"* అని అన్నారు. " *ఫ్లోరెన్స్ నైటింగేల్ 1812 మే 12వ తేదీన ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆ రోజులలో వైద్యశాలలు శుచిశుభ్రత లేకుండా అధ్వాన్నస్థితిలో ఉండేవి. నైటింగేల్ తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా సేవ చేయడానికై నర్సింగ్ వృత్తిని యెంచుకొని జర్మనీ, ఐర్లాండ్ లలో పనిచేసి అక్కడ వైద్యశాలల పరిస్థితులలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మెరుగుపరచి తిరిగి లండన్ వచ్చి అక్కడ హాస్పిటళ్ళలో పరిశుభ్రతకు ప్రాధాన్యతతో పాటు రోగులకు పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాటు చేసింది. 1854లో క్రీమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో క్షతగాత్రులైన సైనికులకు తోటి నర్సులను కూడగట్టుకుని నిరుపమానమైన సేవలు అందించింది. ఎంతో గుండె నిబ్బరంతో చిమ్మచీకట్లలో చిరుదీపం వెంట తీసుకుని వెళ్ళి రోగులకు సేవలందించి, వారిలో బ్రతుకుతామనే ఆశలను చిగురింపజేసింది. వారి ముఖాలపై చిరునవ్వులు ఆమె చేతిలోని దీపంలాగా వెలిగాయి. రోగులకు కావలసిన మందులు, పరికరాలు పంపమని ప్రభుత్వానికి అర్జీలు పంపేది. రోగులకు ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత యిళ్ళను, భవనాలను ఆసుపత్రులుగా మార్చేది. 'త్రాగుడుకు డబ్బులు కర్చు పెట్టకండి. ఆ డబ్బులను మీ యింటికి పంపిస్తే యిల్లు గడుస్తుంది కదా' అని హితబోధ చేసేది. గ్రంథాలయాలు, చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. నోట్స్ ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్ అనే గ్రంథాలను వ్రాయడమే కాక, విక్టోరియా రాణికి అలాగే ప్రభుత్వ అధికారులకు హాస్పిటల్స్ బాగు కొరకు అభ్యర్థనలు పంపేది. నాటి నుండి నర్సింగ్ వృత్తికి ప్రత్యేకంగా శిక్షణ యివ్వడం ప్రారంభం అయింది. 1860వ సంవత్సరం జూన్ 24 న ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ అనే సంస్థను లండనులో స్థాపించింది. ఆమెను 'మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్' గా గుర్తించారు. ఆవిడ భారతదేశానికి కూడా యితోధిక సేవలు అందించారు. 1859వ సంవత్సరంలో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమీషన్ ను నియమించింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ సూచనలు, సలహాల మేరకు భారతదేశంలో శానిటరీ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని వల్ల మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ మరలా పుట్టి నేటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను మెరుగు పరచాలని కోరుకుందాం. సేవానిరతి గల ప్రతి నర్సులోనూ ఆమె జీవించి ఉంటుంది. నర్సులు, రోగులు గుర్తుంచుకోవలసీన ఆదర్శమూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్* " అని కొనియాడారు. " *NURSE అనే ఆంగ్ల పదంలోని అక్షరాలకు (N) NOBLE, (U) UNDERSTANDING, (R) RESPONSIBILITY, (S) SYMPATHY (E) EFFICIENT అనే ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువదిస్తే మహోన్నతమైన, అవగాహన, బాధ్యత, సానుభూతి, సమర్థవంతమైన సేవలు అందించేదే నర్సింగ్ వృత్తి"* అని అన్నారు. " *నైటింగేల్ నర్సింగ్ వృత్తికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆవిడ జన్మదినమైన మే12వ తారీఖునాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం"* అని అన్నారు. " *నేటి యువ నర్సులు ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలి* " అని కోరారు. " *కనిపించే దేవుళ్ళు వైద్యులైతే కాపాడే దేవతలే నర్సులు"* అని కొనియాడారు. తదనంతరం నర్సులచేత ' *రోగులకు అంకితభావంతో మెరుగైన సేవలు అందిస్తాం'* అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మానవసేవే మాధవసేవగా భావించి వివిధ ప్రభుత్వ వైద్యశాలలో (నిమ్స్, లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, కొండాపూర్, ఏరియా హాస్పిటల్, పటాన్ చెరు, ESI హాస్పిటల్, RC పురం, BHEL జనరల్ హాస్పిటల్, హఫీజ్ పేట అర్బన్ హెల్త్ సెంటర్, HCU హెల్త్ సెంటర్, ఉర్దూ యూనివర్శిటీ హెల్త్ సెంటర్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్) రోగులపట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ వైద్య సేవలందించిన సేవామూర్తులైన 80 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుతో పాటు శాలువ, జ్ఞాపిక, పగిడిలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం E. దేవానంద్ యాదవ్ సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నండూరి వెంకటేశ్వర రాజు, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, G.V. రావు, సత్యనారాయణ,వాణిసాంబ శివరావు,విజయలక్ష్మీ ,విష్ణుప్రసాద్, బాలాజీ, శివరామిరెడ్డి,వెంకటేశ్వర్లు,పాండు,తదితరులు పాల్గొన్నారు.

32
3381 views

Comment