ఏలూరు: పాత మహిళా నేరస్తురాలిని సీసీటీవీ సాయంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏలూరు: పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణలో విజయవంతంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న అడ్వాన్స్‌డ్ సర్వైలెన్స్ వ్యవస్థ ఫలితంగా పాత మహిళా నేరస్తురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీటీవీ కెమెరాలను 24 గంటలు పర్యవేక్షిస్తూ జంగారెడ్డిగూడెం బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళపై సమాచారం సేకరించారు.
సీసీటీవీ ద్వారా వెలువడిన లక్షణాలు పాత నేరస్తురాలితో సరిపోలడంతో జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ వీర ప్రసాదుకు సమాచారం అందించి, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దిగుమర్తి భవాని అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గతంలో విశాఖపట్నం జీఆర్‌పీ రైల్వే పోలీస్ పరిధిలో పలు నేరాల్లో పాల్గొన్నట్లు, జంగారెడ్డిగూడెం, హనుమాన్ జంక్షన్ పరిధిలో ఆస్తి నేరాల్లో కూడా ప్రమేయం ఉందని ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెను లోతుగా విచారిస్తున్నారు. పోలీసులు ఈ సాంకేతికతతో నేరాలపై మరింత ప్రాముఖ్యత సాధిస్తున్నారని తెలిపారు.