ఆళ్లగడ్డ టిడ్కో కాలనీలో డీఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
AIMA న్యూస్ నంద్యాల జిల్లా : ఆళ్లగడ్డ పట్టణ శివారులోని టిడ్కో గృహ సముదాయంలో గురువారం సాయంత్రం ఆళ్లగడ్డ డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళల రక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, సాంకేతికత వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి వివరిస్తూ, యువతులు స్మార్ట్‌ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించారు. అయితే, ఫోన్ల ద్వారా ఎవరైనా ఇబ్బంది పెట్టినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవాలని, పిల్లల భవిష్యత్తుకు అనుకూలంగా ఉండాలని సూచించారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం శక్తి టీం నిరంతరం అందుబాటులో ఉంటుందని, అనుమానాస్పద ఘటనలు లేదా ఆకతాయిల వేధింపులపై వెంటనే సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ పీరయ్య, శక్తి టీం సభ్యులు, స్థానిక పోలీస్ సిబ్బంది, టిడ్కో కాలనీ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.