ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్‌లు..
*ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్‌లు.. 6,124 మంది ఇతర శాఖలకు సర్దుబాటు*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై వెళ్లనున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో 6,124మంది మిగులు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై వివిధ ప్రభుత్వ శాఖలకు పంపించనున్నారు.
గత నెలలో సీఎస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో మిగులు ఉద్యోగుల సేవల్ని ఇతర ప్రభుత్వ శాఖలలో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. వివిధ శాఖల నుంచి 9 వేల మందికిపైగా ఉద్యోగులను డిప్యుటేషన్లపై పంపాలని ప్రతిపాదనలు వచ్చాయి.. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత 6,124మందిని కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోని ఈ 6,124మందిలో.. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు, మహిళా పోలీసులు, వార్డు రెవెన్యూ, ప్లానింగ్ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌లు, వార్డు సదుపాయ కల్పన కార్యదర్శులు ఉన్నారు. త్వరలోనే వీరిని డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు పంపిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోని ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగుల్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిగా విలీనం చేయాలన్నారు.
మహిళా పోలీసుల బదిలీలు
మరోవైపు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 86 మందిని స్పౌజ్ గ్రౌండ్స్ కింద అంతర్ జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ కోసం జీఎస్‌డబ్ల్యూఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే అవకాశం దక్కింది. మహిళా పోలీసుల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఈ బదిలీలకు సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఇటు జైళ్ల శాఖలో కూడా కీలకమైన బదిలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్‌లను బదిలీ చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఎం.నాగరాజును నియమించారు. నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌లుగా నానుబాల సాయిప్రవీణ్, పి.రమేష్‌లను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.