logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘోర ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Srikakulam:సింహాచలం నరసింహస్వామిని దర్శించుకుందామని అత్త కోరడంతో సరే అన్న అల్లుడు దైవ దర్శనానికి పయనమయ్యారు. అంతలో 'అమ్మమ్మ, బాబాయ్‌ నేనూ వస్తాను' అని చిన్నారి మారాం చేయడంతో బైక్‌మీద ముగ్గురూ శ్రీకాకుళం నుంచి బయలుదేరారు. సింహాచలంలో స్వామిని దర్శించుకొన్నారు. అనంతరం అదే ద్విచక్రవాహనంపై స్వగ్రామం తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారిపై భోగాపురం సచివాలయం సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన లారీని ఢీకొన్నారు. రెప్పపాటులో రోడ్డుపై పోడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు. తేరుకొని చూసే సరికి మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకొన్నారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సంచన సాయికుమార్‌(24), అత్త గార మండలం దీపావళి గ్రామానికి చెందిన లావేటి చిన్నమ్మలు(45) ఈమె మనవరాలు సీహెచ్‌ రుత్విక(4) అక్కడకక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సంచన సాయికి గార మండలం దీపావళి గ్రామానికి చెందిన లావేటి తేజతో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. తేజ ప్రస్తుతం గర్భిణి. సాయి కుటుంబంతో కలిసి విశాఖనగరంలోని మర్రిపాలెంలో నివాసముంటున్నాడు. డోర్‌ డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 28న వారాల పండుగ కోసం సాయికుమార్‌ స్వగ్రామం ఫరీదుపేటకు భార్య, తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. మంగళవారం వరసకు అన్న అయిన ఈశ్వరరావు ఇంట్లో వారాల పండుగలో పాల్గొన్నాడు. బుధవారం ఉదయానే సాయికుమార్‌ తల్లిదండుల్రు బస్సులో మర్రిపాలెం వెళ్లిపోయారు. భార్య తేజను అత్తవారి గ్రామమైన గార మండలం దీపావళికి తీసుకెళ్లాడు. సాయికుమార్‌ అత్త సింహాచలం స్వామిని దర్శించుకోవాలని ఉందని అనడంతో కాదనలేక అత్త లావేటి చిన్నమ్మడును తీసుకొని ద్విచక్రవాహనంపై బయలుదేరడానికి సిద్ధపడ్డారు. అంతలో చిన్నమ్మడు పెద్ద కుమారై కూతురు రుత్విక కూడా తానూ వస్తాను అని అల్లరి చేయడంతో ముగ్గురూ ద్విచక్రవాహనంపై బయలు దేరారు. సింహాచలంలో దైవ దర్శనం చేసుకొని అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి శ్రీకాకుళం వైపు జాతీయ రహదారిపై వస్తున్నారు. భోగాపురం సచివాలయం-2 సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన లారీని ఢీకొన్నారు. దీంతో ముందు కూర్చున్న బాలికతో సహా ముగ్గురూ కింద పడిపోయారు. ముగ్గురికీ తలకు బలమైన గాయాలు కావడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. సమీపంలో టీ షాపుల్లో ఉన్న పలువురు ఘటనను చూసి దిగ్ర్భాంతికి లోనయ్యారు. క్షణాల్లో తేరుకొని ఘటనా స్థలానికి చేరుకుని సపర్యలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. అచేతనంగా చిన్నారిని చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకొన్నారు. సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐలు వి.పాపారావు, పి.సూర్యకుమారి పోలీస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) పి.సౌమ్యలత, ఇన్‌చార్జి డీఎస్పీ రాఘవులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించారు. కుటుంభ సభ్యులు, స్థానికులతో మాట్లాడారు. మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటరావు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

0
0 views

Comment