మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య*
*మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య*
కామారెడ్డి:మాంసాహారం వండలేదన్న విషయంలో మొదలైన చిన్నపాటి గొడవలో క్షణికావేశానికి గురైన భార్య.. భర్తపైకి కొడవలి విసరడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. గోసంగికాలనీకి చెందిన కోదండం శివాజీ(28), లక్ష్మికి 2017లో వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా.. శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేసేవారు. శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న శివాజీ మాంసాహారం ఎందుకు వండలేదని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగా అరుచుకున్నారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి సముదాయించడంతో కాసేపు ఊరుకున్నారు. మళ్లీ తనను తిట్టడంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి అక్కడే ఉన్న కొడవలిని శివాజీపైకి బలంగా విసిరారు. అది అతని మెడ భాగంలోని నరానికి తగిలి తీవ్ర రక్తస్రావమై 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోయారు.
క్షణికావేశంలో భర్తనే చంపుకొన్నానని, తాను జైలుకు వెళితే పిల్లలను ఎవరు చూసుకుంటారని ఇద్దరు బిడ్డలను ఒడిలోకి తీసుకొని లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శివాజీ సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
సేకరణ