logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆర్టీసీ మాయం..ఇకనుండి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్

తెలంగాణ ఆర్టీసీ అనే పేరు తొందరలోనే మాయమైపోయి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు కానుంది. మూడు రోజుల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ఫలితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఈ క్లారిటి ఇచ్చింది.
అసలు విషయం ఏమిటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయాలనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉన్నది. తాజా సమ్మెలో ఆర్టీసీ యూనియన్ నేతలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో విలీనం ప్రస్తావన చాలా కీలకంగా మారింది. ఆర్టీసీలోని మొత్తం 38,300 మందిని తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబోతున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయిపోయిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ కాస్త ప్రజా రవాణా విభాగంగా మారబోతోంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి అవసరమైన కసరత్తును పూర్తిచేయటానికి ప్రభుత్వం ఉన్నతాధికారులు, నిపుణులు, యూనియన్ నేతలతో కమిటి వేసింది. కసరత్తు పూర్తయి రిపోర్టు రాగానే దానిపై న్యాయనిపుణులతో చర్చించి క్యాబినెట్ లో చర్చించి లాంఛనాన్ని పూర్తిచేస్తుంది ప్రభుత్వం. ఒకసారి విలీనం పూర్తయిపోతే ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదవీ విరమణ ప్రయోజనాలు, సెలవులు అన్నీ లభిస్తాయి. కాకపోతే విలీనం ద్వారా ప్రభుత్వంపై పడబోయే వెయ్యికోట్ల రూపాయల భారాన్ని మోయటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది.

ఆర్టీసీ సమస్యలను ఒక్కసారిగా శాశ్వతంగా పరిష్కరించేయాలని రేవంత్ ఆదేశాల కారణంగానే యూనియన్ నేతల డిమాండ్లలో చాలా వాటిని మంత్రుల కమిటి ఓకే చెప్పేసింది. కేసీఆర్ హయాంలో కూడా డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు 53 రోజులు సమ్మెచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సమ్మెను గుర్తించటానికి కేసీఆర్ ఏమాత్రం ఇష్టపడలేదు. దాదాపు 30 మంది చనిపోయారు. కొందరు గుండెపోటుతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ చలించలేదు. చివరకు వేలాదిమందిని సెల్ఫ్ డిస్మిసల్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల్లో నుండి తీసేసింది. అప్పట్లో కార్మికులు, ఉద్యోగుల విషయంలో అంత నిర్దయంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు ఇపుడు కార్మికులకు మద్దతుగా మొసలికన్నీరు కార్చటమే ఆశ్చర్యంగా ఉంది.

కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన కారణంగా ప్రధానంగా జీతాలు పెరగబోతున్నాయని సమాచారం. సంస్ధలో పనిచేస్తున్న 38,300 మందికీ జీతాలు పెరగటం ఖాయం. ఎవరెవరికి ఎంతెంత జీతం పెరుగుతుందన్నది వారి బేసిక్ పే మీద ఆధారపడుంది. అయితే అందుబాటులోని సమాచారం ప్రకారం విశ్రాంత విద్యోగులకు 2021, ఏప్రిల్ 1 తర్వాత రిటైర్ అయిన సుమారు 9600 మందికి కూడా జీతాల పెంపు లబ్ది అందుతుంది. జీతాల పెంపు తదితరాల వల్ల నెలకు ప్రభుత్వం మీద పడే అదనపు భారం రు. 35 కోట్లని తేలింది. అంటే జీతాల రూపంలోనే ప్రభుత్వంపై ఏడాదికి పడబోయే అదనపు భారం సుమారు రు. 420 కోట్లు. కండక్టర్లకు నెలకు సుమారు రు. 4 వేల నుండి రు. 15 వేల వరకు, డ్రైవర్లకు రు. 4 వేల నుండి రు. 17 వేల వరకు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి.

2021 నుండి పెంపు వర్తిస్తుంది కాబట్టి మొత్తం బకాయిల భారం సుమారు రు. 2400 కోట్లు. ఈ భారాన్ని రెండు పద్దతుల్లో మోయటానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు రు. 200 కోట్లను ముందుగానే చెల్లించాలని. ఇక సర్వీసులో ఉన్నవారికి అందించాల్సిన బకాయిలు రు. 2178 కోట్లు పదవీ విరమణ సమయంలో చెల్లించేట్లుగా కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయిన తర్వాత యూనియన్ అంటు ఉండదు. కాకపోతే అసోసియేషన్ అనే పేరుతో నడుపుకోవచ్చు.

7
202 views

Comment