logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు...*

*రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు...*

- *రాయిగూడెం 'ప్రజా దర్బార్'లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి*

- *న్యాయమైన సమస్య అయితే పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ*

నేలకొండపల్లి (రాయిగూడెం) : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో వినూత్నంగా చేపట్టిన 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని శనివారం రాయిగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించారు. రాయిగూడెం, అజయ్‌తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి పొంగులేటి ముఖాముఖి భేటీ అయ్యారు.

- *పారదర్శక పాలన - ప్రజల ముంగిటకే యంత్రాంగం*
గతంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు వింటున్నారని మంత్రి తెలిపారు. "ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. మీ కష్టాలను వినే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టే ధైర్యంగా మీ మధ్యకు రాగలుగుతున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

- *క్లస్టర్ల వారీగా.. క్షుణ్ణంగా పరిష్కారం*
ప్రజా దర్బార్‌ను కేవలం సభలా కాకుండా, ప్రతి పంచాయతీకి ఒక క్లాస్‌రూమ్‌ కేటాయించి అధికారులను కూర్చోబెట్టడం ద్వారా సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. స్పాట్‌లోనే పరిష్కరించే వీలున్న సమస్యలను వెంటనే తేల్చేయాలని, మిగిలిన వాటికి వారం, నెల, మూడు నెలల చొప్పున గడువు నిర్ణయించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

- *రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి*
"రాజకీయాలు ఎన్నికల వరకే. గెలిచిన తర్వాత ప్రభుత్వం అందరిది. అడిగిన పని న్యాయమైనదైతే, ప్రజలకు ఉపయోగపడేదైతే తప్పకుండా పూర్తి చేస్తాం" అని మంత్రి వివరించారు. ఈ నియోజకవర్గంలో చేస్తున్న ఈ ప్రయోగం రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడానికి ఒక నమూనాగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

*శాఖల వారీగా సమీక్షలు*
ఈనెల 27వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సమస్యలను పారదర్శకంగా, వడివడిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు.

- *ప్రజల ఆశీస్సులే నా బలం*
"మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నన్ను గెలిపించారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అసాధ్యమైన హామీలు నేను ఇవ్వను కానీ.. మీరు అడిగే సమస్య న్యాయమైనదైతే దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది" అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

0
0 views

Comment