logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

“కార్యదర్శి సార్.. ఇదిగోండి లంచం” –జగిత్యాలలో ఒక పేద మహిళ కన్నీటి కథ - చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ నం: 9948133539

“కార్యదర్శి సార్.. ఇదిగోండి లంచం”
–జగిత్యాలలో ఒక పేద మహిళ కన్నీటి కథ

- చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ నం: 9948133539

ఒక పేద మహిళ చేతిలో డబ్బుల కట్ట. ఎదురుగా ప్రభుత్వ ఆఫీసు. ఆమె గొంతులో వణుకు. కళ్లలో నీళ్లు. ఆమె అంటోంది: "ఇదుగోండి సార్… మీరు అడిగిన యాభై వేలు… ఒక్క రూపాయి తక్కువ కాదు… ఇప్పుడు మా పని చేస్తారా?" ఇది సినిమా సన్నివేశం కాదు. ఇది నిజ జీవితం. మన చుట్టూ జరుగుతున్న కఠిన సత్యం. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో రేంగుంట గంగమ్మ (భర్త: రేంగుంట రాజు) అనే మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు లేని పేదలకు ఆసరాగా ప్రభుత్వం ఇచ్చేదే ఈ ఇల్లు. కానీ ఈ ఇల్లు తనకు రావాలంటే గంగమ్మకు ఒక అడ్డంకి వచ్చింది. "ముగ్గు పోసిన ఫొటోలు అప్లోడ్ చేయాలి" అనే చిన్న పనికి గ్రామ కార్యదర్శి ఆరిఫోద్దీన్ అనే అధికారి యాభై వేలు లంచం అడిగారు. అవును. ఇల్లు లేని పేద మహిళ దగ్గర యాభై వేలు లంచం.

గంగమ్మ బాధ అక్కడితో ఆగలేదు. ఆమె భర్త పేరు మీద ఉన్న కొంచెం స్థలాన్ని తన పేరు మీదకు మార్చుకోవడానికే ఇంతకుముందు ముప్పై వేలు లంచం ఇచ్చేసింది. ఇప్పుడు ఇల్లు కోసం మరో యాభై వేలు. మొత్తం ఎనభై వేలు. ఒక పేద కుటుంబానికి ఎనభై వేలు అంటే అది డబ్బు కాదు – అది చెమట, అప్పు, బాధ, అవమానం. గంగమ్మ ఒకటే ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఒక్కటే చాలు మన వ్యవస్థను కుదిపేయడానికి. "ఉండటానికి దిక్కు లేకపోతేనే ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది… ఆ ఇల్లు కోసం డబ్బులు అడిగితే మేమేం చేయాలి సార్?" ఆమె మాటలు నిజమే. పేదరికంలో ఉన్నవారికే ఈ ఇండ్లు. అలాంటి వారి దగ్గరే లంచం అడిగితే, వారు ఎక్కడికి వెళ్లాలి?

కొందరు అనవచ్చు.. "అది గ్రామ కార్యదర్శి ఆరిఫోద్దీన్ తప్పు మాత్రమే" అని. కానీ నిజం అది కాదు. ఎందుకు ఇలా జరుగుతోంది? పై వారు పర్యవేక్షణ సరిగా చేయడం లేదు. ఫిర్యాదు చేయడానికి సులువైన దారి లేదు. అవినీతి చేస్తే తగిన శిక్ష పడటం లేదు. ఇవన్నీ కలిపే ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతున్నాయి. గంగమ్మ ఒక్కర్తే కాదు ఇలా బాధపడేది. మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు తెలుసు – లంచం ఇవ్వకపోతే పని జరగదని. తెలిసీ ఇస్తారు. ఎందుకంటే వాళ్లకు వేరే దారి ఉండదు. ఇది చాలా బాధాకరమైన నిజం.

గంగమ్మ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేయించాలి. గ్రామ కార్యదర్శి ఆరిఫోద్దీన్ తో సహా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గంగమ్మకు వెంటనే ఇల్లు ఇప్పించాలి. ఇక మీద ఇలాంటివి జరగకుండా పారదర్శక వ్యవస్థను తీసుకురావాలి. లంచం ఇచ్చిన పేదలను నేరస్తుల్లా కాకుండా బాధితుల్లా చూడాలి. గంగమ్మ చేతిలోని యాభై వేలు – అవి కేవలం డబ్బులు కావు. అవి ఆమె కన్నీళ్లు. కన్నీళ్లను డబ్బుగా మార్చే ఆ వ్యవస్థ ఎంత పెద్దదైనా – మనుషుల ముందు అది చిన్నదే. ఈ కథ గంగమ్మ కథ మాత్రమే కాదు. ఇది మన సమాజానికి అద్దం. ఇకనైనా మార్పు రావాలి. అది ప్రభుత్వం చేతుల్లోనే కాదు.. మనమందరి చేతుల్లోనూ ఉంది.

0
0 views

Comment