సెక్రెటరీలను ముంచిన మన సెక్రెటరియేట్ పాలకులు
రెండేండ్ల చెక్కులు రిటర్న్ కొట్టిన తెలంగాణ సర్కార్
లబో - దిభో మంటున్న పంచాయతీ కార్యదర్శులు
సెక్రెటరీలను ముంచిన మన సెక్రెటరియేట్ పాలకులు
రెండేండ్ల చెక్కులు రిటర్న్ కొట్టిన తెలంగాణ సర్కార్
లబో - దిభో మంటున్న పంచాయతీ కార్యదర్శులు
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గిఫ్ట్ ఇదేనేమో....?
చేసిన అప్పుల బాధలతో.... సెక్రటరీలకు తప్పని తిప్పలు
పస్తులతో పడిగాపులు గాస్తున్న పంచాయతీ కార్యదర్శులు
( చుక్క గంగారెడ్డి,
- సీనియర్ జర్నలిస్ట్
- అధ్యక్షులు, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ - ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ,
సెల్ నం. 9948133539 ), తేది: 24-04-2026, శుక్రవారం
*************************************************
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులను మన సెక్రెటరియేట్ పాలకులు నిండా ముంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల పాటు కొనసాగిన స్పెషల్ ఆఫీసర్ పాలనా కాలంలో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పెట్టిన ఖర్చుల బిల్లులు చెల్లిస్తున్న సమయంలో గత రెండేండ్ల చెక్కులను ఈ రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ చేసినట్లు తెలిసింది.
ఈ దెబ్బతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు అంతా
లబో - దిభో మంటూ మొత్తుకుంటున్నారు.
ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, అప్పులు చేసి, ప్రజల కోసం పాటు పడ్డ పంచాయతీ కార్యదర్శులు ఇక మా బిల్లులు వస్తున్నాయి అప్పులు తీర్చేయాలి అనుకునే సమయంలో....
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులకు మన సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనేమో....?
చేసిన అప్పుల బాధలతో.... సెక్రటరీలకు తీవ్రమైన తిప్పలు తప్పడం లేదు.
నిత్యం అప్పుల బాధలు భరించలేక కొందరు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు.
కొందరు వారి భార్యల పుస్తెల తాడులతో సహా బ్యాంకుల్లో, వివిధ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవక పస్తులతో పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలు పడిగాపులు గాస్తున్నాయి.
గడిచిన రెండేండ్ల కాలంలో వచ్చిన జీతంతో పాటు అప్పులు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించి తిప్పలు పడుతుంటే గురు, శుక్ర వారాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీలకు వెళ్లిన చెక్కుల చెల్లింపులను నిలిపివేసి చెక్కులన్నీ రిటర్న్ చేయడం మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అయింది పంచాయతీ సెక్రటరీలకు.
ఒక్కసారి గుండెలు ఆగిపోయేంత పనయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి రిటర్న్ చేసిన చెక్కులను అన్నింటినీ తిరిగి చెల్లింపులు జరిపి మమ్మల్ని ఆదుకోవాలని యావత్ తెలంగాణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో చేసిన అప్పుల బాధలతో ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమా... అని కూడా కొందరు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర మానసిక క్షోభకు, మనో వేదనకు పంచాయతీ కార్యదర్శులు గురై ఇక మా పరిస్థితి ఏమిటని ప్రశ్నార్థకంలో మునిగారు పంచాయతీ కార్యదర్శులంతా....
శనివారం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించి జిల్లా కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసి వెంటనే రిటర్న్ చేసిన చెక్కులను తిరిగి పాస్ చేయాలని కోరడం చేస్తే బాగుంటుందని పంచాయతీ కార్యదర్శుల సంఘాలు గుసగుసలు పెడుతున్నట్లు తెలిసింది.
అవసరం అయితే తెలంగాణ రాష్ట్ర సెక్రటరియేట్ ను సైతం ముట్టడించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మరో వైపు పంచాయతీ కార్యదర్శుల నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం అయితే... ఇక మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏమిటో.....? ఇది ఎటు దారి తీస్తుందో... నని విద్యావంతులు, విశ్లేషకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది.
ఇక మన తెలంగాణ సర్కార్... ఎలా స్పందిస్తుందో....! పంచాయతీ కార్యదర్శుల చెక్కుల పంచాయతీని ఎలా తెంపుతుందో....!!
వేచి చూడాల్సిందే........!!!