పుడమి సంరక్షణకు రైతులు బాధ్యత
"పుడమి సంరక్షణకు రైతులు బాధ్యత తీసుకోవాలి" -పర్యావరణ ఇంజనీర్ కరుణశ్రీ
లావేరు:భూమి, నీరు, గాలి కాలుష్యాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ కరుణశ్రీ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేపడితే నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. అలాగే, రసాయన మందులను పిచికారీ చేసే సమయంలో స్ప్రింక్లర్ పద్ధతి ఉపయోగిస్తే జల కాలుష్యాన్ని నియంత్రించవచ్చని సూచించారు.
పంట కోతల తర్వాత అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం వలన భూసారం పెరుగుతుందని, పొలం గట్లపై కొబ్బరి, తాటి వంటి చెట్లు పెంచినట్లయితే గాలి వేగాన్ని నియంత్రించి పంటలు నేలమట్టం కాకుండా కాపాడటం, కాలుష్యం తగ్గడంతో పాటు మట్టి సారవంతత పెరుగుతుందని వివరించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గారి ఆదేశాల మేరకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు అందిస్తున్నామని చెప్పారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలలో వరుసగా ఒకటి, మూడు, ఏడు రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని, సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ధరిత్రీ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటామని భూమి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, కాలుష్య నియంత్రణ, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యమని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్.హరిబాబు అన్నారు.
కార్యక్రమం అనంతరం “ప్రతి ఇంటికి ఒక మొక్క” కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.జగన్నాధరావు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సీనియర్ ఏరియా మేనేజర్ పి. తవిటినాయుడు, గ్రామ పెద్దలు, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.