వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఉత్తర్వులు, తాజా మార్పులు..!!
వేసవి సెలవుల ప్రారంభం వేళ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గతం కంటే భిన్నంగా ఈ సారి సెలవుల పైన ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు ఈ మేరకు మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 2 లేదా 3వ తేదీల్లో పదో తరగతి ఫలితాల విడుదలకు వీలుగా విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభం.. తీసుకోవాల్సిన చర్యల పైనా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.ఏపీ విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. దాదాపు 48 రోజులు విద్యార్థులకు సెలవులుగా నిర్ధారించింది. ఈ నెల 23వ తేదీ స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు బయట తిరగడం, ఎండలో ఇబ్బందులకు గురి కాకుండా పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. పది ఫలితాల పైన తుది కసరత్తు జరుగుతోంది. మే తొలి వారంలో పది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదే విధంగా వేసవి సెలవుల ప్రారంభం వేళ ప్రభుత్వం జిల్లాల విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతాయి.
ప్రభుత్వం మార్గదర్శకాలు ఇక.. పాఠశాలలకు జూన్ 12 నుంచి తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి వేసవి సెలవుల్లో విద్యార్ధుల దినచర్యపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లని వ్వవద్దని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశా లు ఇచ్చింది. అన్ని స్కూళ్లల్లో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ సూచించింది. సెలవులు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థుల కౌన్సెలింగ్ సెషన్‌లన్నీ పూర్తి చేయాలని నిర్దేశించింది.