ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం: ఇల్లందులో చైతన్యవంతంగా సాగిన 'పోషక పక్వాడ'!*
కౌన్సిలర్ చిల్లా విజయభారతి ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు
ఇల్లందు:
నేటి బాలలే రేపటి పౌరులు.. వారు శారీరకంగా, మానసిక దృఢత్వంతో ఎదిగినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ ఆశయ సాధనలో భాగంగా ఇల్లందు పట్టణంలోని 5 వ వార్డులో 'పోషక పక్వాడ', బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి చిల్ల విజయభారతి ముఖ్య అతిథిగా హాజరై, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, సమాజంలో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు నిశ్శబ్ద శత్రువులని అభివర్ణించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తాము తీసుకునే ఆహారం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. "కేవలం కడుపు నింపుకోవడం ఆహారం కాదు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడమే అసలైన పోషకాహారం" అని ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న బలవర్ధకమైన ఆహారాన్ని, ఇతర సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం ఒక ప్రభుత్వ వేడుకగా కాకుండా, ప్రజల ఆలోచనా దృక్పథంలో మార్పు తేవాలన్నది ప్రధాన ఉద్దేశం. గర్భిణులు సరైన పోషకాలు తీసుకోకపోతే, అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై జీవితకాల ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవనశైలిలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, స్థానికంగా లభించే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పండ్లను స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. ప్రజాప్రతినిధులు స్వయంగా వార్డుల్లో పర్యటిస్తూ ఇలాంటి చైతన్యాన్ని తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమం, ఆరోగ్యకరమైన ఇల్లందు స్థాపనకు ఒక బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు అని పేర్కొన్నారు. అనంతరం 5 వ వార్డ్ కౌన్సిలర్ చిల్ల విజయ భారతి ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గుండె. ధనలక్ష్మి, టీచర్స్ అరుణకుమారి, విజయ, అంగన్వాడి ఆయాలు గౌసియా, ధనలక్ష్మి ,స్థానిక మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.