జల సంరక్షణ అందరి బాధ్యత
జిల్లా పరిషత్ హై స్కూల్, రోలుగుంటలో జల పక్వాడా కార్యక్రమం
రోలుగుంట: “జల సంరక్షణ అందరి బాధ్యత” అనే నినాదంతో జిల్లా పరిషత్ హై స్కూల్, రోలుగుంటలో జల పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నీటి ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించారు.
ఈ సందర్భంగా నీటిని ఆదా చేయడం, వృథా కాకుండా చూడడం, వర్షపు నీటిని సేకరించడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడం వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పోస్టర్లు, నినాదాల ద్వారా నీటి విలువను చాటి చెప్పారు.
ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో జల పక్వాడా ప్రతిజ్ఞను విద్యార్థులందరితో చేయించారు. నీటిని కాపాడాలని, ప్రతి నీటి బిందువును విలువైనదిగా భావించాలని వారు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు గారు, సైన్స్ ఉపాధ్యాయులు విజయరాణి గారు, నాని గారు, ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం.నాగజ్యోతి గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నీరు ప్రతి జీవికి ప్రాణాధారం కాబట్టి దానిని సంరక్షించడం మన అందరి కర్తవ్యమని తెలిపారు.
ఈ జల పక్వాడా కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యం కలిగించడంతో పాటు నీటి సంరక్షణపై సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.