logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు మరియు మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడి) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టబడినట్లు తెలిపారు.భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని వివరించారు.ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం ద్వారా ఎటువంటి కొత్త చట్టబద్ధ యాజమాన్య హక్కులు కల్పించబడవని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ రికార్డులలో ఉన్న భూ వివరాలను ప్రామాణికంగా తీసుకొని రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు, యూరియా మరియు ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు.
రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, లేక సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.వ్యవసాయ శాఖ అధికారులు, మీసేవ కేంద్రాల వారు తమ పరిధిలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

27
3832 views

Comment