మర్రి నరేష్ : బిజెపి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు హెచ్చరిక
బిజెపి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు హెచ్చరిక
భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీ నాయకురాలిపై కొందరు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే పార్టీ పరంగా కఠిన చర్యలు తప్పవని బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నుండి బహిష్కరణకు గురైన కొందరు వ్యక్తులు, వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి పై అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ కేవలం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికే చేస్తున్న కుట్రలని కొట్టిపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే జగిత్యాలలో కూడా పార్టీ ఆదేశాల మేరకు మధుసూదన్ రెడ్డి సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ పార్టీ అధిష్టానం మార్గదర్శకాల ప్రకారం, ఎంపీ అర్వింద్ నాయకత్వంలో అత్యంత పారదర్శకంగా జరిగాయని యాదగిరి బాబు స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో అత్యధిక ఓట్లు సాధించిన మహిళా అభ్యర్థిగా గుర్తింపు పొందిన శ్రావణిపై ఇలాంటి అసత్య ప్రచారాలను వెంటనే ఆపివేయాలని ఆయన పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.